భీమదేవరపల్లి, ఆగస్టు 20: రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతుల్లో 70 శాతం వరకు రుణాలు తీసుకున్న వాళ్లే ఉంటారని తెలిపారు. రుణాలు తీసుకోని వాళ్లకు కూడా రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రుణమాఫీపై బండి సంజయ్, కేటీఆర్, హరీశ్‌రావు కూడబలుక్కుని మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్రం నుంచి రైతులకు ఏం జేసిండ్రో బీజేపీ నేతలు చెప్పాలని, జవాబు చెప్పినంకనే తమను అడగాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఎన్ని దఫాల్లో చేసిందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. రూ.లక్ష, లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని, రెండు లక్షలకుపైగా ఉన్నవాళ్లకు కూడా మాఫీ చేసేందుకు యోచిస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి రుణమాఫీ పొందని రైతుల కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని, రుణమాఫీ రాని రైతులు రైతు వేదికల్లో వ్యవసాయాధికారులను సంప్రదించాలని కోరారు.