సూర్యాపేట : తన ఫోన్ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నది వారేనని అయినా హోం మంత్రి చేతకానితనమే దీనికి నిదర్శనమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనడం హాస్యాస్పదమని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మంత్రి పొంగులేటి అనడం అంటే తమది దద్దమ్మ ప్రభుత్వం అని వారు ఒప్పుకున్నట్లేనని, రాష్ట్రంలో పోలీసింగ్ లేదని, ప్రభుత్వం చేతగాని స్థితిలో ఉందని వారి మాటల్లోనే తేటతెల్లమవుతోందని విమర్శించారు. హోం మంత్రిగా ఉన్న వ్యక్తి విఫలమయ్యారని మంత్రులే పరోక్షంగా ఒప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛ లేకుండా పోయిందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తల్లా వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని,
బీఆర్ఎస్ ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందనేదనేది కేవలం అపోహ మాత్రమేనని, నిజానికి మంత్రుల ఫోన్లను కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. నిజంగా ట్యాపింగ్ జరుగుతుంటే, అది ఎవరో తేల్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల సమయంలో సహకరించాలని ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం వారి బలహీనతకు నిదర్శనమన్నారు. ప్రజల్లో ఆదరణ లేక ఇప్పుడు ఉద్యోగుల వద్దకు కాళ్ల బేరానికి వెళ్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా రాబోయేది మళ్లీ కేసీఆర్ రాజ్యమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.