హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అర్ధరాత్రి కూడా యాక్సెస్ ఉన్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాహుల్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య గ్యాప్ ఉన్నదనడం అబద్ధమని పేర్కొన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై మీడియా ప్రతినిధులు అడుగగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాహుల్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, అర్ధరాత్రి కూడా కలిసే యాక్సెస్ రేవంత్‌రెడ్డికి, టీపీసీసీ చీఫ్‌కు ఉన్నదని తెలిపారు. అనేకసార్లు కలుస్తారని, మరికొన్ని సార్లు కలువకపోవచ్చని అన్నారు.
అప్పట్లో పార్టీలో నంబర్ -2ను అని చెప్పారు కదా అని గుర్తుచేయగా, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, అందులో తాను కేవలం నీటి బిందువునని పేర్కొన్నారు. తాను పార్టీకి ఏదైనా చెప్తే పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదని అన్నారు. తన ఇంటిపై జరిగిన ఈడీ దాడుల గురించి ప్రశ్నించగా.. ‘నా పైన, నా ఇంటిపైన ఈడీ రైడ్ జరగలేదు. నా కూతురు ఉంటున్న నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి. అయినా నాకు సంబంధం లేదని నేను అనను.. కట్టలకట్టల డబ్బులు దొరికాయి నా ఇంట్లో.. అని కేటీఆర్ మాట్లాడటం బంద్ చేయాలి’ అని చెప్పారు.
అసైన్డ్ భూములను ఎవరైనా ఆక్రమించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అనేక చోట్ల అసైన్డ్ భూములు బడాబాబుల పేర, రాజకీయ పెద్దలు, కంపెనీల పేరుతో ఉన్నాయని, ఆడిట్లో ఆక్రమించుకున్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అసైన్డ్ భూముల ఆక్రమణపై మీడియా ప్రశ్నించగా.. ఆడిట్లో ఆక్రమించినట్టు తేలితే చర్యలుంటాయని చెప్పారు. అసైన్డ్ భూములు అర్హులైన నిరుపేదల పేరుతో ఉంటే విచారణ జరిపి సాగు చేసేందుకు వారికే అప్పగిస్తామని పేర్కొన్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ సిస్టమ్తోపాటు ఆధార్ అనుసంధాన రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 413 గ్రామాల్లో నక్షలు లేవని, వీటిలోని ఐదు గ్రామాల్లో నక్షల రూపకల్పన కోసం ఏరియల్ సర్వేతోపాటు భౌతిక సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు.