హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రైతుల డాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటూ విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేయబోతున్నది. 2014కు ముందు న్న నిషేధిత భూముల జాబితాను అమలుచేస్తామని, ఇందుకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ పనిని ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రైవేట్ సంస్థలతో చేయిస్తామని మంత్రి మంగళవారం వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన చిట్‌చాట్ లో మంత్రి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతను త్వరలో ప్రైవేట్ సంస్థల కు అప్పగిస్తామని చెప్పారు. అంటే, 2014 కు ముం దున్న భూములు, రైతుల సమాచారం, ప్రస్తుతం ధరణిలో ఉన్న రైతులు, భూముల వివరాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడతారన్నమాట. ఆ కంపెనీలు రైతుల భూ ముల వివరాలను కాపీ చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వీఆర్వోల నియామకంపై ప్రభుత్వం ఊగిసలాట కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే వీఆర్వోల నియామకంపై చర్చించి ఆమోదిస్తారని అందరూ భావించారు. కాని, వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఫైలు ఆలస్యంగా రావడం వల్ల క్యాబినెట్లో చర్చించలేకపోయామంటూ మంత్రి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మంగళవారం ఆయన ట్రెసా రెవెన్యూ డైరీ ఆవిష్కరణలో మాట్లాడుతూ.. వచ్చే క్యాబినెట్ సమావేశంలో వీఆర్వోల నియామకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్వో వ్యవస్థపై ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం, పూర్వ వీఆర్వోలనే మళ్లీ తీసుకొస్తుండటంపై వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. సర్వేయర్లుగా పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను నియమించడంపై అటు రెవెన్యూ ఉద్యోగుల నుంచి, ఇటు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. న్యాయస్థానంలోనూ సవాలు చేసే అవకాశం ఉండటంతో వీఆర్వోలు, సర్వేయర్ల నియామకాల విషయంలో తాత్సారం చేస్తున్నట్టు సమాచారం.