హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్న 5,364 ఇండ్లకు రూ.53.64 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లింపులపై అధికారులతో సమీక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని సర్వే రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. తొలుత ప్రయోగాత్మకంగా నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం లింగాల, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకోరుకొండిలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 5 వేల సర్వేయర్ల నియామకానికి 10, 031 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.