అశ్వారావుపేట టౌన్, జూలై 22: పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడం తీరని నష్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం వాటిల్లేదికాదని అన్నారు. తక్షణ సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.8.50 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మండలంలోని గుమ్మడివల్లి సమీపంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఇటీవల తెగి ఆయకట్టు రైతులు, స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మంత్రి పొంగులేటి సోమవారం పర్యటించారు. కొట్టుకుపోయిన పంటలను, ఇసుక మేటలు వేసిన పొలాలను, దెబ్బతిన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కింద 16 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. రాష్ట్రంలో 3,200 ఎకరాలు మాత్రమే సాగవుతున్నాయని, మిగిలిన 13 వేల ఎకరాలు ఆంధ్రాలోనే సాగవుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ శ్రద్ధ చూపకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో 400 ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని, ఇసుక మేటలను తొలగించేందుకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని చెప్పారు. పొంగులేటి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటమునిగిన గుడిసెలకు రూ.10 వేలు, ఆర్సీసీ స్లాబ్ ఇండ్లకు రూ.5 వేలు సాయంగా అందిస్తామని తెలిపారు.