కూసుమంచి, సెప్టెంబర్ 24: ఎట్టకేలకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు గండిపడి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి కాలువ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. దీంతో లీక్ అయిన ప్రాంతంలో సోమవారం నుంచే అధికారులు యుద్ధప్రాతిపదికన పను లు చేపట్టారు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజాము నుంచి నీటిని విడుదల చేశారు. కాగా, ఈ నీటి ప్రవాహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. తదుపరి చర్యల గురించి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు.
జిల్లాకు పూర్తిగా సాగునీరు అందించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై వారితో మాట్లాడారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పలు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలి వరదల కు పాలేరు కాలువకు గండి పడగా శనివారం అధికారులు దానిని పూడ్చారు. ఆ తరువాత ట్రయల్ రన్లో కాలువ నీళ్లు మరోసారి లీక్ అయ్యాయి. దీంతో యూటీని పేల్చి వేసి దాని ని డమ్మీ చేశారు. అక్కడ జమ కూడే నీటిని నాలుగు 100 హెచ్‌పీ మోటర్ల ద్వారా తిరిగి నేరుగా కాలువలోకి తరలించాలని నిర్ణయించారు.
మంత్రులు పొంగులేటి, తుమ్మల మరమ్మతుల పనులను పరిశీలించారు. లీకేజీ పనులను కూడా ఎట్టకేలకు పూర్తి చేసి మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రింగ్‌బండ్ తీసేసి క్రమంగా నీటిని వదిలారు. మొదట 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా సామర్థ్యాన్ని పెంచుతూ మంగళవారం రాత్రి వరకు 2000 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బుధవారం ఉదయం వరకు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు.
నీటిని వదిలిన తరువాత కాలువ ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి.. ఎఫ్టీఎల్, కెనాల్ లెవెల్, బండ్ లెవల్ వంటి గణాంకాలను ఇరిగేషన్ అధికారులను అడిగారు. వారు సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు అధికారులను నియమించి గంటగంటకు దాని ప్రోగ్రెస్‌ను కలెక్టర్‌కు తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, ఈఈ అనన్య, డీఈ మధు, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, ఎస్సై నాగగరాజు, నాయకులు పాల్గొన్నారు.
బండ్ ఎత్తును పెంచి బుధవారం వరకు జిల్లాలోని చివరి ఆయకట్టు రైతులకు కూడా పూర్తిస్థాయిలో నీటిని అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బండ్ ఎత్తును ఇంకా ఐదు అడుగుల మేర పెంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. బుధవారం ఉదయం వరకు ఈ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ ముత్తయ్యనాయుడు మంత్రికి తెలిపారు.