Pinarayi Vijayan : కేరళంసహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో అధికార ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ) కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన సీపీఎం తన అభ్యర్థుల్ని ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన కొద్దిసేపటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంజీ గోవిందన్.. తమ పార్టీ అభ్యర్థుల వివరాల్ని వెల్లడించారు. సీపీఎం సభ్యుడైన కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదాం నుంచి పోటీ చేయనున్నట్లు గోవిందన్ వెల్లడించారు.
ప్రస్తుతం పినరయి విజయన్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే మొత్తం 140 సీట్లకుగాను, 86 సీట్లలో సీపీఎం పోటీ చేయనుంది. అందులో 56 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం 86 సీట్లకుగాను 75 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. అలాగే పార్టీ అభ్యర్థులే అయినప్పటికీ ఆరుగురు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారు. మొత్తంగా 81 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా ఐదు నియోజకవర్గాలకు చెందిన వారి వివరాల్ని రెండు రోజుల్లో వెల్లడిస్తారు. మరోవైపు ఎల్డీఎఫ్ కూటమిలోని రెండో ప్రధాన పార్టీ అయిన సీపీఐ కూడా 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ జాబితాను వెల్లడించారు. మిగతా పార్టీలు కూడా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తాయి. కేరళంలో ఒకే దశలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. కేరళంలో అధికారం దక్కాలంటే 71 సీట్లు దక్కించుకోవాలి.