Indiramma Indlu |హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన తన నివాసంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వహించొద్దని సూచించారు. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయించాలని ఆదేశించారు.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే ప్రభుత్వం కొత్తగా పోస్టులు మంజూరు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. 10,954 జీపీవో, కొత్త డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిషారానికి త్వరలోనే భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.