హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బకనచర్ల ప్రాజెక్ట్‌పై పోరాటం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎందాకైనా పోరాటం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని వివరించారు. సోమవారం ఆయన సచివాలయంలో క్యాబినెట్ భేటీ ము గిసిన అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. బనకచర్లపై క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని, తెలంగాణ నీటి వాటాను తెలంగాణకు తెచ్చేందుకు కృతనిశ్చయంతో ముందుకెళ్లాలని తీర్మానించినట్టు చెప్పారు. జూలై మొదటి వారంలో ప్రజాప్రతినిధులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, కేంద్రం ముందు తాము ఎలాంటి వాదనలు వినిపించామో వెల్లడిస్తామని తెలిపారు.
రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి నీటిచుక్క కోసం అన్ని వేదికలపై పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి క్యాబినెట్ నిర్ణయాల అమలుపై సమీక్షిస్తామని వెల్లడించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్లతోపాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రెండు వేల మందితో ‘రైతునేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలు