హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మరో లక్ష ఇండ్లు పూర్తి కాబోతున్నాయి’- ఇవీ బుధవారం మీడియాతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయితే, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొంగులేటి చెప్తున్న మాటలకు, వాస్తవాలకు పొంతన లేదని తెలుస్తున్నది.
చేస్తున్న ప్రకటనలు, మంజూరు చేసిన ఇండ్లు, పూర్తి చేసిన ఇండ్లకు సంబంధించిన లెక్కలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్తుండగా.. ఇప్పటివరకు 3,24,952 ఇండ్లు మాత్రమే మంజూరైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇందులో గ్రౌండింగ్ అయినవి 2,74,307 ఇండ్లు కాగా, మరో 50 వేల ఇండ్లు ఇంకా గ్రౌండింగ్ కాలేదు. 2024 మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా.. 26 నెలల్లో పూర్తి చేసినవి 57,067 మాత్రమే.
మంత్రి పొంగులేటి మాత్రం రాష్ట్రంలో లక్ష ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం. మరోవైపు బేస్మెంట్ దశలో 52,795 ఇండ్లు ఉండగా, వాలింగ్ దశలో 30,528, స్లాబ్ దశలో 98,987 ఇండ్లు ఉన్నాయి. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి చెప్తుండగా, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.6,255 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. సొంత స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొనేవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడేమో ఇండ్లు కట్టుకున్నవారికి రూ.3.6 లక్షలు మాత్రమే ఇస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పథకం ప్రారంభించి 26 నెలలు కావస్తున్నా మొదటి విడత ఇండ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. మార్చి నాటికి లక్ష ఇండ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి ప్రకటించగా.. నేటికి ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 57,067 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. అందులో అనేకమంది లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు చెల్లించలేదని తెలిసింది.
స్థలాలు ఉన్నచోట ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండగా.. మంత్రి పొంగులేటి మాత్రం హైదరాబాద్‌లో ఎకరానికి రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకైనా వెచ్చించి ప్రజలు వారు నివాసం ఉంటున్న చోటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదనే వాదన వినిపిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లపై జాప్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఎండగట్టారు. హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ సర్కార్‌కు ఉన్న ఇండ్లను కూలగొట్టుడు తప్ప కొత్త ఇండ్లు కట్టే సోయి లేదని మండిపడ్డారు. దీంతో ఉలిక్కిపడ్డ మంత్రి పొంగులేటి హుటాహుటిన హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. హైదరాబాద్‌లో ఎన్ని ఇండ్లు నిర్మించారో సమాధానం చెప్పలేని స్థితిలో మంత్రి పొంగులేటి.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే ఎక్కువ కట్టి చూపిస్తామని వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఇండ్లు కట్టడం అసలు సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యతా అంశంగా పరిగణించి నిర్మాణాలను వేగంగా చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తున్నది.