Indiramma Indlu | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం రూ.లక్ష అప్పు చేయాలి. అప్పు పుట్టని పేదలకు ‘సొంత ఇల్లు’ కలగానే మిగిలిపోనున్నది. ప్రభుత్వం చెప్తున్న మార్గదర్శకాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ‘లబ్ధిదారుల ఎంపికలో పేదరికమే ప్రాతిపదిక.
మొదట నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేస్తాం’ అని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదేపదే చెప్తున్నారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లోనూ ఇదే విషయం మరోసారి చెప్పారు. కనీసం 400 చదరపు అడుగుల్లో (45 చదరపు గజాలు) నిర్మాణం ఉండాలని, ఒక వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం విషయంలో మాత్రం మెలిక పెట్టారు. లబ్ధిదారులు మొదట పునాదుల నిర్మించుకోవాలని, నిర్మించిన తర్వాత మొదటి విడత కింద రూ.లక్ష సాయం చేస్తామని తెలిపారు. ఇక్కడే పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా 45 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక హాలు, ఒక వంటగది, మరుగుదొడ్డి నిర్మించడానికి పునాదుల వరకు పూర్తిచేయాలన్నా కనీసం రూ.లక్ష ఖర్చవుతుంది. భూమి చదును చేయడం మొదలు పునాదులు పూర్తయ్యే వరకు కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. రేకుల షెడ్లు, గుడిసెల్లో జీవించేవారు పునాదుల దాకా నిర్మించుకునేందుకు రూ.లక్ష ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. కుటుంబం మొత్తం పనిచేసినా వారి రోజువారీ జీవనమే కష్టంగా గడుస్తుందని గుర్తు చేస్తున్నారు. వారికి కనీసం రూ.లక్ష అప్పు పుట్టే పరిస్థితి కూడా ఉండదంటున్నారు.
పునాదుల వరకు పూర్తయిన తర్వాత రూ.లక్ష, గోడల వరకు పూర్తయితే రూ.1.25 లక్షలు, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.75 లక్షలు, మొత్తం ఇల్లు ప్తూయిన తర్వాత రూ.లక్ష ఇస్తామని చెప్పారు. అంటే.. ప్రతి దశలో అప్పులు తెచ్చి, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు పూర్తయ్యేదాకా అప్పులు తెచ్చుకోవాల్సిందే. పైగా ప్రతి దశలో అప్పు కొంత పెరుగుతుంది. మొత్తంగా ఇంటి నిర్మాణం పూర్తయ్యేనాటికి ప్రభుత్వం ఇచ్చే సాయం పోను ఆ కుటుంబంపై ఎంతో కొంత అప్పుల భారం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలైనప్పుడు సైతం నిరుపేదలకు ఇదే పరిస్థితి ఎదురైందని గుర్తు చేస్తున్నారు. ఈ భారం భరించలేనివారు, అప్పులు పుట్టనివారు మధ్యలోనే నిర్మాణాలను వదిలేశారని గుర్తు చేస్తున్నారు. ‘మేం ఇల్లు మంజూరు చేశాం, కానీ లబ్ధిదారులే వినియోగించుకోలేదు’ అని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నమే అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మొదటి దశకు రూ.28 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నదని మంత్రి పొంగులేటి చెప్పారు. బడ్జెట్లో రూ.7,740 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆర్థిక సంవత్సరం సంగం పూర్తయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ నెల 5, 6 తేదీల్లో లబ్ధిదారుల ఎంపిక మొదలుపెడతామని, 15 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తామని అంటున్నారు. అంటే నవంబర్ పూర్తవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలింది నాలుగు నెలలే. ఇంత తక్కువ సమయంలోనే ప్రభుత్వం రూ.7,740 కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మందికి మాత్రమే ఈ పథకంతో లబ్ధి కలుగుతుందని చెప్తున్నారు.