Ponguleti Srinivas Reddy | ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఎలా ఇస్తారంటూ గిరిజనులు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చుట్టుముట్టారు. అన్ని అర్హతలు ఉన్న తమను కాదని, పైగా ఎంపిక జాబితాలో ఉన్న పేర్లను తొలగించి అనర్హులకు ఇండ్లు కట్టబెట్టారంటూ నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరిస్తామని, అర్హులకు అన్యాయం జరుగనీయబోమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొద్దిరోజులకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డొల్లతనం, పక్షపాత ధోరణి బయటపడింది.
మంత్రి శ్రీనివాసరెడ్డి ఎదుట ఓ గిరిజన కుటుంబం సాక్ష్యాధారాలతో సహా ఈ తప్పిదాన్ని ఎత్తిచూపింది. అర్హుల జాబితా నుంచి తమను ఎందుకు తొలగించారో చెప్పాలని నిలదీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని సాక్షాత్తూ మంత్రి సొంత నియోజకవర్గమైన పాలేరులోనే చోటుచేసుకున్నది. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం దుబ్బతండాలో ఇందిరమ్మ ఇండ్లను సోమవారం ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో అర్హుల పేర్లు తొలగించడాన్ని, అనర్హుల పేర్లు జాబితాలో వెల్లడించడాన్ని గమనించిన ఓ గిరిజన కుటుంబం వెంటనే మంత్రి ఎదుటే నిరసనకు దిగింది.
అర్హుడినైన తనకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదంటూ అదే తండాకు చెందిన బోడా సేవా, అతడి తల్లి, భార్య అక్కడే ఆందోళనకు దిగారు. అర్హుల జాబితాలో ఆదివారం తన పేరును ప్రకటించిన అధికారులు.. సోమవారం ఇండ్ల ప్రారంభోత్సవం నాటికి జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతోపాటు మహిళలు మంత్రి పొంగులేటిని చుట్టుముట్టారు. సాగు భూములు ఉన్న వారికి కూడా ఈ ఇండ్లల్లో చోటుకల్పించినట్టు ఫిర్యాదు చేశారు. కానీ సాగు భూమి, ఇల్లు కోల్పోయిన తమకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమ అర్హతను పరిశీలించి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సంబంధిత అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేశారు. లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని, అర్హులకే ఇండ్లు ఇవ్వాలని సూచించారు. ఈ ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికపై మరోసారి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు రాని వారికి మరో దఫాలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చారు.