Ponguleti Srinivasa Reddy | కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నపుడు ఏసీపీ కూడా అందుబాటులో లేడని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. కరీంనగర్‌లోని మల్టీపర్పస్ స్కూల్ వద్ద పార్క్, హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌లు, నిరంతర నీటి సరఫరాను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తోపులాట జరుగగా మంత్రి పొంగులేటి పక్కనుంచి నడుస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిని చూసి ఒక్కసారిగా అసహనానికి గరయ్యారు. ‘వాట్ ఈజ్ దిస్, వాటర్ యూ డూయింగ్.. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా.. ఎస్పీ ఎక్కడ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కలెక్టర్ నిశ్చేష్టురాలై పోయారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అసహనం వ్యక్తంచేశారు. మహిళ అని కూడా చూడకుండా కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. సభ ముగిసిన తర్వాత మంత్రులకు వీడ్కోలు పలికేందుకు వెళ్లినపుడు కూడా మంత్రులిద్దరూ కలెక్టర్‌ను పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న పింగిలి శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డికి సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం(సీపీఎస్ టీఈఏ), ప్రోగ్రెస్సీవ్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ, టీఎస్) సంఘాలు మద్దతు పలికాయి. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన రెండు సంఘాల నేతలు ఏకగీవ్రంగా మద్దతు తెలిపారు. అనంతరం నారాయణగూడలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డికి తమ మద్దతు లేఖను అందజేశారు. సీపీఎస్‌టీఈఏ అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్లు టీవీ ప్రసాద్, కే నాగేశ్వర్రావు, పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య పాల్గొన్నారు.