ఖిలావరంగల్, మే 3: రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడేది బ్రోకర్ పార్టీ బీజేపీ నేతలవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో బుధవారం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని అన్నారు. తొమ్మిదేండ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో తాను, చంద్రబాబు నాయుడు, మోదీ ముగ్గురం కూర్చోని మాట్లాడుకున్న సంభాషణను మంత్రి దయాకర్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.200 చేస్తానని నాడు మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.1,250కి పెంచారని విమర్శించారు.
‘ఒకప్పుడు వరంగల్‌లో అజంజాహి మిల్లు కూతకు మనమంతా లేచేది.. ఇప్పుడు కూత లేదు.. మిల్లు లేదు. కాంగ్రెస్ ఆ మిల్లును అమ్ముకున్నది. మిల్లుపై ఆధారపడిన వారిని ఆగం చేసింది’ అని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. సీఎం కేసీఆర్ అజంజాహి మిల్లును మించి మెగా టెక్స్టైల్ పార్ను వరంగల్‌లోనే ఏర్పాటు చేశారని తెలిపారు.