నిజామాబాద్, ఆదిలాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ ప్రజాసంగ్రామ యాత్ర సభలో నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ప్రశంసలు కురిపించిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడితే.. దమ్ముంటే దర్యాప్తు చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా విమర్శించిన దుర్మార్గుడు మోదీ అని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ పదుల సార్లు తన అక్కసును వెళ్లగక్కిన మూర్ఖుడు అని ఆక్షేపించారు. బీజేపీలో మోదీ దగ్గరి నుంచి కింది స్థాయి నేతల వరకు అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. నల్లధనం తెస్తాం, రూ.15 లక్షలు ప్రజల ఖాతాల్లో వేస్తాం అన్నది నిజం కాదా? అని నిలదీశారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేస్తామని మోసం చేశారని అన్నారు. బీజేపీ అధిష్ఠానం హామీలతో మోసంచేస్తే, నిజామాబాద్ జిల్లా ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చి ఇక్కడి ఎంపీ రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. నడ్డాకు సిగ్గు, చీము, నెత్తురు ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడతామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నాన్చుతున్న కేంద్రానికి బుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంస్కార హీనులు కాంగ్రెస్, బీజేపీ నేతలు సంస్కారహీనులని నిరంజన్‌రెడ్డి ధ్వజతమెత్తారు.నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీజేపీది తెలంగాణలో తోడు పెండ్లి కొడుకు పాత్ర అని, కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిది అద్దెకు ఏడ్చే పాత్ర అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ నేతల స్క్రిప్ట్‌ను నడ్డా చదివారని, రాహుల్ గాంధీది కూడా కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్టే అని చెప్పారు. కాంగ్రెస్, సోనియాను దుర్భాషలాడిన వ్యక్తి నేడు టీపీసీపీ ప్రెసిడెంట్ కావడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సినిమాల్లో ఐటం సాంగుల్లాంటివని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలనలో ఛత్తీస్‌గఢ్‌లో రెండేండ్లలో 1,344 మంది, గత పది నెలల్లోనే 141 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని గణాంకాలతో వివరించారు. పార్లమెంట్లో కాళేశ్వరం అవినీతి గురించి రేవంత్‌రెడ్డి ప్రశ్న అడిగితే అలాంటిదేమీ లేదని కేంద్ర మంత్రే సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని చెప్పడానికి నడ్డాకు సిగ్గుండాలని మండిపడ్డారు. సమావేశంలో ఎంపీలు సురేశ్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హన్మంతు షిండే, జాజాల సురేందర్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నడ్డాకు మతి భ్రమించింది: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మతి భ్రమంచి మాట్లాడుతున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో మార్కండేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని బీజేపీ నాయకులు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎలాంటి సాయం చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలిపారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఉన్నా, తెలంగాణ వెలిగిపోతున్న విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. నడ్డా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న హరితహారం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నదని గుర్తుచేశారు. దేశంలో అటవీవిస్తీర్ణం పెరుగుదలలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని నివేదిక ప్రకటించిందని వివరించారు. హైదరాబాద్ తొలిస్థానంలో ఉన్నట్టు నివేదికలో వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు.