వనపర్తి : దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని, అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఇంకో ఏడాదిన్నర అయితే బీజేపీ పీడ విరగడ అవుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు లేవని, జిల్లాకో మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనన్నారు.
కేసీఆర్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పథకాలన్ని దేశమంతటా అమలవుతాయన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమన్నారు. ప్రతి నిమిషం ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నాడన్నారు. మన పార్టీ బీఆర్ఎస్ అని, కాబోయే ప్రధాని కేసీఆర్ అన్న లక్ష్యం కార్యకర్తలు పని చేయాలన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయానన్న మల్లారెడ్డి.. మంత్రి నిరంజన్‌రెడ్డి మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చారన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో వనపర్తి అభివృద్ధి ముందున్నదన్నారు.