సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూరులో మంత్రి మహేందర్‌రెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి 500 ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. సీఎం పేదల పక్షపాతి అని, కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్నట్టు వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం విషయంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలిపారు. కర్ధనూరులో పంపిణీ చేసిన డబుల్ ఇండ్ల ధర ఒక్కొక్కటి రూ.60 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. పేదలు తమకు కేటాయించిన ఇండ్ల్లలో ఉండాలని, ఎవ్వరూ అమ్ముకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.