తాండూరు, అక్టోబర్ 4: మోసం చేసే కాంగ్రెస్‌ను, కీడు తలపెట్టే బీజేపీని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. కర్ణాటక సంక్షోభంలో కూరుకుపోతే, రాష్ట్రం అభివృద్ధితో వెలిగిపోతున్నదని చెప్పారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూ రు నియోజకవర్గంలో రూ. 102.28 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు.
తాండూరు-కర్ణాటక పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నదని చెప్పారు. ఒక అడుగు ఇటు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, సాగునీటి దృశ్యాలు కనిపిస్తాయని.. అదే ఒక అడుగు కర్ణాటక వైపు వేస్తే ఎండిన పొలాలు, ఎప్పుడొస్తదో తెలువని కరెంటు దుస్థితి కనిపిస్తుందని తెలిపారు. ప్రజలను మోసం చేసే కాంగ్రెస్‌ను, కీడు చేసే బీజేపీని నమ్మరాదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ‘కారు గుర్తు’కు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.