హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది. సభా నాయకుడిగా సీఎం తరుపున తనకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కేటీఆర్ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నారని అసెంబ్లీ లాబీలోనే కాదు రాజకీయ విమర్శకుల్లో సైతం చర్చ జరగడం గమనార్హం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపడం అంటే.. తమ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమకాలం నుంచి నేటి దాక సీఎం కేసీఆర్ వెంట నడుస్తూ, అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపడమే నని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో కేటీఆర్ ప్రవేశపెట్టిన తీరుకు సభికులే కాదు టీవీల్లో వీక్షించిన వారంతా మంత్రముగ్ధులయ్యారు.
తన రాజకీయ కెరీర్లోనే ఎప్పటికీ నిలిచిపోయేలా కేటీఆర్ ప్రసంగించారు. ఏకబిగిన నాలుగు గంటల పాటు సాగిన స్పీచ్‌కు అంతా ఫిదా అయ్యారు. కవితాత్మకంగా, తన వాక్పటిమతో అన్‌స్టాపబుల్‌గా ప్రసంగించారు. విపక్ష సభ్యులను సైతం పేరు పేరున పలుకరిస్తూ, అన్నా అంటూ సంబోధిస్తూ అలరించారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఎనిమిదిన్నరేండ్ల అనతి కాలంలోనే స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ప్రోగ్రెస్ రిపోర్టును రెండో ప్రభుత్వం చివరి బడ్జెట్ సమావేశాల్లో యువనేత అంతా తానై నడిపించి సవ్యసాచిని తలపించారు. చలోక్తులు, హాస్యోక్తులు, గౌరవంతో కూడా ఎత్తిపొడుపులతో సాగుతూ మధ్యమధ్యలో సభలో నవ్వులు పూయించారు.
కేసీఆర్ అంతరంగం ఆవిష్కరణ
తెలంగాణపై పగబట్టినట్టుగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రప్రగతికి అడ్డం పడుతున్నా, అదరకుండా, బెదరకుండా, మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేస్తున్న తీరుకు మంత్రి కేటీఆర్ ప్రసంగం అద్దం పట్టింది. రాజనీతితో, ప్రజల పట్ల ప్రేమతో మానవీయ పాలకుడిగా, రేపటి తరాల భవిష్యత్తు కోసం దార్శనికతతో అన్ని రంగాలను ప్రగతిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ పాలనను కేటీఆర్ అనర్గళంగా వివరించారు. తెలంగాణ పాలనను కానీ, అభివృద్ధిని కానీ ఏనాడూ కనీసం గుర్తించడానికి నిరాకరిస్తున్న మోదీ తీరును కేటీఆర్ ఉతికి ఆరేశారు. ఇంటికి పెద్దలా అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి అడ్డం పడుతున్న దుర్మార్గాన్ని ఎండగట్టిన తీరు ఎంతో ఉద్రేకాన్ని నింపింది.
తెలంగాణ ఏ రకంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది? దేశం తెలంగాణ మాడల్‌ను ఎందుకు కోరుకుంటుంది? అదే సమయంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ సర్కార్ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించటంలో ఎట్లా విఫలమైంది? మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ప్రజలకు కరెంట్ ఇవ్వటంలో, తాగునీరు అందించటంలో ఎంత ఘోరంగా విఫలమైంది? వంటి అంశాలను ఆయన ఆధారాలతోసహా సభలో ఎండగట్టారు. రాష్ట్రంలో విపక్షాల బాధ్యతారాహిత్యాన్ని కూడా తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. విపక్షాలపై పదునైన వాగ్బాణాలు సంధించారు. ప్రపంచంలో భారత ప్రతిష్ఠను కేంద్ర సర్కార్ ఎలా దిగజార్చిందో, ఫలితంగా దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నదో మంత్రి కేటీఆర్ సభ ముందుంచారు.
ఫొటోలతో సోదాహరణంగా వివరిస్తూ చేసిన ప్రసంగం సామాన్యులనే కాదు రాజకీయ విమర్శకులను సైతం ఆలోచనలో పడేసింది. అన్ని శాఖలు సాధించిన ప్రగతిని అంకెలు, సంఖ్యలతో సహా నిర్దుష్ట ఆధారాలను చూపుతూ సందర్భోచితంగా కేటీఆర్ ప్రదర్శించిన రాజనీతి ప్రతిభ రేపటి తెలంగాణ నాయకత్వ పటిమను ఆవిష్కరించింది. అటు శాసనసభలో, ఇటు మండలిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అలవోకగా, అనర్గళంగా ప్రసంగించి ఔరా అనిపించారు. విపక్ష సభ్యుల అభ్యంతరాలకు ఎటువంటి భేషజాలు లేకుండా ప్రభుత్వ పొరపాట్లను సవరించుకుంటూ స్థితప్రజ్ఞతో సాగిన కేటీఆర్ ప్రసంగం సీఎం కేసీఆర్‌ను మరిపించింది. కేసీఆర్ ఫాదరాఫ్ తెలంగాణ అయితే.. కేటీఆర్ ఫ్యూచరాఫ్ తెలంగాణ అనే ప్రజాకాంక్షకు శనివారం సభ దర్పణం పట్టింది.
వైతాళికులను స్మరిస్తూ..
మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ వైతాళికులను ఆకాశమంత ఎత్తుకు నిలుపుతూనే ఆర్బీఐ, నాబార్డ్, నీతిఆయోగ్, ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు తెలంగాణకు ఇచ్చిన ప్రశంసల ఆధారాలతోపాటు, అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజినీర్స్, ఐక్యరాజ్యసమితి నివేదికలను ఆయన ఉటంకించారు. ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, సదాశివుడు మొదలుకొని ఫ్లోరైడ్‌తో జీవితాంతం పోరాటం చేసి ఇటీవల మరణించిన అంశాల స్వామి దాకా ప్రతిఒక్కరి సేవలను స్మరించుకున్నారు.
విపక్షాలపై తీరుపై నిర్మాణాత్మక మండిపాటు
కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా.. గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని, అలా చేయటం సహేతుకం కాదని మంత్రి కేటీఆర్ సూచించారు. ‘ప్రభుత్వానికి మీరు నిర్మాణాత్మక సూచనలు చేయకపోవచ్చు.. కానీ బాధ్యతగల అధికార పక్షంగా మేము మీకు సూచిస్తున్నాం. ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలి. అధికారం ఎప్పటికీ.. ఎవరికీ శాశ్వతం కాదు.. అంతిమంగా ప్రజలే మనకు ప్రభువులు’ అని ఆయన సూచించారు. ఒకదశలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఒకవైపు కీర్తిస్తూనే మరోవైపు నిందాపూర్వంగా గట్టిగా మాట్లాడే సమయంలో ‘గొంతుచించుకుని పెద్దపెద్దగా మాట్లాడటం సరైంది కాదని’ చురకలు అంటించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఉద్దేశించి ‘రఘునందన్‌రావు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా… సభలో వకాల్తాపుచ్చుకొని వాదించటం సరికాదు’ అని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య పోడుభూముల సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరి తీరా సమాధానం ఇచ్చే సమయంలో సభలో లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ‘భూసేకరణ చట్టాన్ని తెచ్చింది మేమే.. ’ అని చెప్పబోతే ‘చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. చేవలేని.. మనసులేని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పోడుభూముల సమస్య అని, ఆనాడు చట్టం తెస్తే నేడు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోనివాళ్లు.. ఇప్పుడు తెలంగాణ కోసమే పనిచేస్తున్నామని చెప్పేవాళ్లు రాష్ట్రం బాగుపడుతుంటే మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ తన ప్రసంగం మారిన తెలంగాణ బతుకు చిత్రం తనదైన వాగ్ధాటితో ఆవిష్కరించి ఔరా అనిపించారు. మంత్రి కేటీఆర్ ప్రసంగం పూర్తయిన తరువాత మంత్రులు, సభ్యులు అందరూ ఆయన దగ్గరికి వెళ్లి అభినందించారు.