సిటీబ్యూరో: సర్కారు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి శాఖల మధ్య వివాదాలకు తెరలేపుతున్నది. శివారులో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపిన సర్కారు.. ఆ తర్వాత అవుటర్ వరకు పరిధిని విస్తరించింది. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మధ్య ఆదాయ వనరులపై పంచాయితీ మొదలైంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి, పాత హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ వరకు విస్తరించి ఉండటంతో, ఆదాయం తెచ్చిపెట్టే భవన నిర్మాణ రంగం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇన్నాళ్లు ప్రభుత్వాలు నిధులు కేటాయించుకున్నా భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆధారపడి కొత్త ప్రాజెక్టులను చేపట్టేవారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మధ్య నెలకొని ఉన్న వివాదంతో రెవెన్యూ ఏ విభాగానికి అనే అంశం చర్చనీయాంశమైంది. భవన నిర్మాణ అనుమతుల విషయంలో పాత విధానంలో 15 మీటర్లకు పైబడి ఉండే భవనాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడాన్ని జీహెచ్ఎంసీకి సమస్యగా మారింది. హైరైజ్ ద్వారా వచ్చే ఆదాయ వనరులన్నీ హెచ్ఎండీఏకు చేరుతాయనే అంశంతో ఆదాయ పంపిణీ అంశం తెరమీదకు వచ్చింది.
హైరైజ్ భవనాలే కీలకం..
సర్కారు భవన నిర్మాణ అనుమతుల విషయంలో పాత విధానం మాదిరి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు పరిమితులను విధించింది. కేవలం 7-10 అంతస్తుల లోపు మాత్రమే జీహెచ్ఎంసీ పరిమితులు ఇవ్వనుంది. ఆపై అంతస్తులకు మించిన మల్టీస్టోర్డ్ బిల్డింగులకు హెచ్ఎండీఏ ఆధీనంలో అనుమతుల ప్రక్రియ సాగేలా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అవుటర్ లోపల ఉన్న గ్రోత్ పరిధి హైరైజ్ భవనాలకు కీలకంగా మారింది.
ఆదాయ పంపిణీ ప్రతిపాదనలు?
భారీ మొత్తంలో వచ్చే ఆదాయంతో జీహెచ్ఎంసీకి ఉన్న అప్పులు భారం తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతోనే ఆదాయాన్ని పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆదాయాన్ని పంపిణీ చేయాల్సి వస్తే.. హెచ్ఎండీఏ పరిధిలో పట్టణాభివృద్ధికి నిధులు వెచ్చించడం ఇబ్బంది అవుతుందని చర్చ నడుస్తున్నది. విలీనం, విస్తరణ అంశాన్నీ శాస్త్రీయంగా చేపట్టకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్న అభిప్రాయం ఉంది. భవన నిర్మాణ అనుమతుల విషయంలో మరిన్ని వివాదాలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.