మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన విప్లవాత్మక పథకాలను వివరిస్తున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండేళ్లలో ప్రజల కోసం ఏం చేసిన్రు? అభివృద్ధి కోసం ఒక్క రూపాయి పనైనా చేశారా? ఇచ్చిన హామీలు ఇంకెన్నాళ్లకు అమలు చేస్తరు? బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను ఎందుకు నిలిపివేస్తున్నరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటు ప్రజలు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు తేడా చూడాలని కోరుతున్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు కూడా మద్దతు తెలుపుతుండగా, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 8: అదిచేస్తాం.. ఇది చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేళ్ల కాలంలో కరీంనగరంలో పైసా అభివృద్ధి పని చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. పైసా పనిచేయని అలాంటి పార్టీలకు ఓట్లేస్తరా..? అని ప్రశ్నించారు. మరోసారి మోసపోయి గోస పడవద్దని హెచ్చరించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 41, 14, 22, 23, 46, 15, 13, 26 డివిజన్లలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల గంగుల మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో 1,650కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. అప్పుడు తెచ్చిన నిధులు ఇంకా మిగిలి ఉన్నాయని, కనీసం వాటితోనైనా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినా స్పందన లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాకముందు రాంనగర్ ప్రాంతం ఒక కుగ్రామంగా ఉండేదని. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం అస్యూరెన్స్ నిధులతో అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నగరంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయాయని, పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునేవారే లేరని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్లో ఈ రెండేళ్లలో ఒక్క పనీ చేయలేదన్నారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేయని బండి సంజయ్‌కి మేయర్ పీఠమిస్తే ఏం ఒరగబెడతారో వారికే తెలియాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగరంలో వేంకటేశ్వర స్వామి ఆలయం కోసం పదెకరాల భూమి కేటాయించామని, ఇప్పటికీ ఆలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మళ్లీ నగరంలో అభివృద్ధి సాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు తోట సుగుణ రాములు, గడ్డి ప్రదీప్, బోనాల శ్రీకాంత్, జంగిలి సాగర్, సుధీర్, గుర్రాల శివప్రియ, కంజర్ల రేణుక, మేడి ఉమామహేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ పొంది రెండేండ్లు కావస్తున్నా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర సుధాకర్ ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటడిగే హక్కు లేదంటూ’ తన ఇంటికి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
మంథని, ఫిబ్రవరి 8 : మంథనిలోని ఎరుకలగూడెం (హనుమాన్‌నగర్)కు చెందిన యువకుడు బజారు శ్రీకాంత్ తన ఇంటి గేటుకు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే గొప్ప ఆయుధం నా ఓటు. నా ఓటును మద్యానికి, డబ్బుకు అమ్ముకోను. ఇట్లు మీ ఓటరు’ అంటూ స్టిక్కర్ అంటించాడు. గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలోనూ ఇదే విధంగా తన ఇంటి ఎదుట బోర్డు ఏర్పాటు చేశాడు.