ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్న, నిర్మల్ బల్దియాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, భైంసాలో మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి జక్క వెంకట్‌రెడ్డి, ఖానాపూర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్‌లు అభ్యర్థుల తరఫున ప్రచారం జోరుగా చేస్తున్నారు.
కేసీఆర్ సైనికులను గెలిపించాలి
– బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 8 : నిర్మల్ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలోని 33వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల్లో వస్తున్న స్పందనతో నిర్మల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ అబద్ధాలు.. కాంగ్రెస్ మోసాలు
మాజీ మంత్రి జోగు రామన్న
ఎదులాపురం, ఫిబ్రవరి 8: బీజేపీ నాయకుల అబద్ధా లు, కాంగ్రెస్ నాయకుల మోసాలతో ప్ర జలు తీవ్ర ఇబ్బందులు ఎదురొవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగు రామన్న సుభాష్ నగర్, టీచర్స్ కాలనీ, దస్నాపూర్, తాటిగుడ, దుర్గానగర్తోపాటు పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే పాయల శంకర్ విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా తన స్వలాభం కోసం ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటూ ఎన్నికల స్టంట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బీఆర్ఎస్ కృషి చేసిందని, బీజేపీ కేంద్ర మంత్రులను కలవడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలో మోసాలకు లోను కాకుండా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి ఒకరు ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దాసరి రమేశ్, ముఖ్యర ప్రభాకర్, నోముల సంతోష్, సర్ఫ్ సోంబాయి, గణేశ్ యాదవ్, ప్రకాశ్, రాజ్యలక్ష్మి వసంత్, రామ్‌కుమార్, రాజు, బొజ్జ సంతోష్, తాటి లక్ష్మణ్, గజ్జు రాథోడ్, తులసి, వాగ్మారె ప్రశాంత్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీల అభివృద్ధి
భైంసా, ఫిబ్రవరి 8 : బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని భైంసా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 12, 14, 19, 24 వార్డులలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హమీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఇందులో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవార్, లోలం శ్యాంసుందర్, పడకంటి రమాదేవి, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజవకర్గ
ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్
ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 8 ః కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రెండేళ్లలో ఎక్కడ అభివృద్ధి జాడలు కనబడడం లేదని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజవకర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1,3,5,6 వార్డుల్లో ఆయా వార్డుల అభ్యర్థులు కొండాడి శ్వేత, గాడ్పు సునీత, మేస పోశాని, షోయోబ్ హూస్సేన్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ప్రజలు కారు గుర్తు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటు హకు వజ్రాయుధం
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
ఎదులాపురం, ఫిబ్రవరి 8 : ప్రజాస్వామ్యంలో ఓటు హకు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒకరూ బాధ్యతగా ఓటు వినియోగించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. ఆదివారం (స్వీప్) ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా స్థానిక కేఆర్కే కాలనీలో భారీ ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కాలనీలో నిర్వహించిన అవగాహ న ర్యాలీని ఆర్డీవో స్రవంతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాలనీ వా సులందరితో ఓటు హకుపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. డీవైఎస్వో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, మెప్మా పీడీ రాజు, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
ఎదులాపురం, ఫిబ్రవరి 8 : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. అకడ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హకును వినియోగించుకుంటున్న తీరును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణిందర్ పాల్గొన్నారు.
ప్రలోభాలకు గురికావద్దు..
ఎదులాపురం, ఫిబ్రవరి 8 : నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఎస్పీ ఆధ్వర్యంలో సాయుధ పోలీసు సిబ్బందితో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని రణదివ్యానగర్, గాంధీనగర్, కుర్షిద్‌నగర్, తాటిగూడ ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు కె.ఫణిదర్, కె.నాగరాజు, బి.సునీల్‌కుమార్, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు.