వికారాబాద్/తాండూరు, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరుకు ఇచ్చిన నర్సిం గ్ కాలేజీని ఎత్తుకెళ్లిన దొంగ రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం జిల్లాలోని తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. తాండూరుకు రూ. వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి మరి దొంగచాటుగా తాండూరుకు మంజూరైన నర్సింగ్ కళాశాలను ఎందుకు కొడంగల్‌కు ఎత్తుకెళ్లాడని.. నిజాయితీ ఉంటే వెంటనే తాండూరుకు రూ. వెయ్యి కోట్ల నిధులు, నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తూ జీవోను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ నుంచి మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి తాండూరు అభివృద్ధికి రూ.వేల కోట్ల నిధు లు తీసుకొచ్చి పనులు చేసినా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మి ఆయన్ను ఆదరించలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారీ మోసపోకుండా తమ సంక్షేమం, అభివృద్ధిని కోరుకునే బీఆర్ఎస్ నాయకులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. మళ్లీ రెండేండ్ల తర్వాత సీఎంగా కేసీఆర్ వస్తే తిరిగి ఎమ్మెల్యేగా రోహిత్‌రెడ్డే ఉంటారన్నారు. ఈ ఎన్నికల్లో కాం గ్రెస్ నాయకులు డబ్బులు పంచితే తీసుకోండని.. పైసలు ఇస్తున్నారని మరోసారి ఆగం రావొద్దని.. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు.
ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను పింఛన్ డబ్బుల పెంపు, ఇతర బకాయిలు, రూ.లక్ష ఎప్పుడిస్తారని నిలదీయాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న నాపరాతి పరిశ్రమలకు కరెంటు బిల్లులు రూ. లక్షల్లో వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో రూ.15 వేల బిల్లులు వస్తే నేడు అదే నాపరాళ్ల యూనిట్లకు రూ. 90 వేల నుంచి రూ. లక్షకు పైగా బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. సోనియాగాంధీపై ఒట్టేసి మరీ రైతుబంధు కింద రూ.10 వేలకు బదులు రూ.15 వేలు రేవంత్‌రెడ్డి ఇస్తానన్నాడని, రైతుబంధును కేసీఆర్ హయాంలో ప్రతి డిసెంబర్ నెలలోనే ఇచ్చే వారమని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చి నా రైతుభరోసా ఊసేలేదని ఆరోపించారు.
అదేవిధంగా అన్ని పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తానని బోగస్ మాటలు చెప్పారని.. అత్తకు రూ.4 వేలు, అభయహస్తం కింద కోడలికి రూ.2500 ఇస్తానని చెప్పారు కదా.. మరీ ఆ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా..? అని ప్రజలను కేటీఆర్ ప్రశ్నించగా లేదు.. లేదు, పడలేవు అని సమాధానమిచ్చారు. దీంతో అది అభయహస్తం కాదు, భస్మాసురహస్తమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పిన హామీలకు ఆగం అయి ఐదేండ్లు బాధపడే పరిస్థితిని తెచ్చుకున్నారన్నారు. మళ్లీ సమయం దొరకదు.. ఈ తప్పులు రెండోసారి చేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు.

రైతులు యూరియా కోసం క్యూలో నిరీక్షించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా ..? రంజాన్‌తోఫాలు అందాయా..? క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందాయా అని కేటీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులను అంబులెన్స్‌ల్లో తీసుకెళ్లి డెలివరీ కాగానే మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు మహాలక్ష్మి పథకం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అందించింద ని.. మరి మీకు ఇప్పుడు ఈ పథకాలు అందుతున్నాయా ..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
పథకాలన్నీ అందకపోవడంతో ప్రజలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని ఎద్దేవా చేశారు. రోడ్‌షోలో తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు విఠల్‌రెడ్డి, రాజూగౌడ్, డాక్టర్ సంపత్‌కుమార్, విజయలక్ష్మి, విఠల్‌నాయక్, కౌన్సిలర్ అభ్యర్థులు దీపానర్సింహులు, పరిమళ, శోభారాణి, నాగలక్ష్మి, ఇర్షాద్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.వెయ్యి కోట్లు తీసుకురాకుంటే రాజీనామా చేస్తావా?
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రెండు నెలల్లో తాండూరుకు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొస్తానని చెబుతున్నాడు. ఆ హామీని నిలబెట్టుకోకుంటే ఆయన రాజీనామా చేస్తారా..? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసింది. తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానా లు గెలిచింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి నర్సింహులుతోపాటు అభ్యర్థులందరినీ గెలిపించుకుందాం.
– పైలెట్ రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే