వనపర్తి టౌన్, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోద్దని, ప్రజల స్థానిక తీర్పుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 5, 7, 8, 9, 17, 18, 19, 21, 23, 24, 25, 26, 27 వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
9వ వార్డులోని మర్రికుంట వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి మాట్లాడారు. తండాలో ఉన్న గిరిజన ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని అందుకు అవసరమయ్యే అంచనా వ్యయాన్ని తయారు చేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తండాలో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలతో రైతులు, ఉద్యోగులు, మహిళలను మోసగించారన్నారు.
కేసీఆర్ పాలనలోనే సంక్షేమ పథకాలు అందాయని, కేసీఆర్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో కాలనీల్లో అభివృద్ధి జరిగిందని ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. కష్టపడి సాధించిన జిల్లాను రద్దు చేస్తే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని, ప్రజలను మోసం చేసి వంచించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధిచెప్పి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌గౌడ్, శంకర్‌నాయక్, శ్రీనివాసులు, బీరయ్య, బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.