హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. కనీసం ఈ సారైనా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తగినన్ని నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని లేఖలో కేటీఆర్ గుర్తుచేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ బడ్జెట్ లోనూ రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన వివక్ష కొనసాగుతున్నదని కేటీఆర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో నిర్దేశించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. దీంతో పాటు తెలంగాణలో మరిన్ని రైల్వే లైన్లను ఏర్పాటుచేసి రైల్ కనెక్టివిటీని పెంచాలన్న తమ ప్రభుత్వ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదన్న కేటీఆర్, ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు ఐటీ ఎగుమతుల వరకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా తెలంగాణ వృద్ధి కొనసాగుతుందన్నారు. ఈ ప్రగతిని మరింత బలోపేతం చేస్తూ రైతులు, ప్రజల ప్రయోజనార్థం లాజిస్టిక్స్ రంగంలో అనేక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అటు సరుకుల రవాణాతో పాటు ప్రయాణికుల టికెట్లతో దక్షిణ మధ్య రైల్వేకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రాబడి వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్లు ఉత్తర, దక్షిణ భారతదేశానికి కనెక్టింగ్ పాయింట్‌గా ఉన్నాయన్నారు. అయితే తీర ప్రాంతం లేనందున సరుకు రవాణా కోసం రైల్వే లపైనే తెలంగాణ ఎక్కువగా ఆధారపడుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ కోరారు.
నూతనంగా ఏర్పాటు చేసే రైల్వే మార్గాలు, ఇతర మౌలిక వసతులతో తెలంగాణ ప్రగతి మరింత వేగంగా ముందుకు సాగుతుందని.. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం సహాయం చేయడం లేదన్నారు కేటీఆర్. గత 8 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 100 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ మాత్రమే వేశారని తెలిపిన కేటీఆర్, దేశంలో ఉన్న మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో తెలంగాణ కేవలం మూడు శాతం మాత్రమే కలిగి ఉన్నదన్నారు. ఇందులో 57 శాతం కేవలం సింగిల్ రైల్వే ట్రాక్ మాత్రమే అన్నారు. కొత్త రైల్వే లైన్లను కనీస మాత్రంగా కూడా కేంద్ర ప్రభుత్వం వేయలేదన్న కేటీఆర్.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని- లింగంపల్లి – విజయవాడ ఇంటర్ సిటీ పేరుతో కేవలం ఒకే ఒక కొత్త రైలును వేశారని తెలిపారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసి నూతన ప్రాజెక్టులు, రైలు సౌకర్యాల విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గతంలో చర్చించేవారని అయితే ఈ ఏడు ఈ సాంప్రదాయాన్ని సైతం పక్కనపెట్టి విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదన్నారు కేటీఆర్. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతున్న పనుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రంతో ఉమ్మడి భాగస్వామ్యంలో చేపట్టిన రైల్వే లైన్ ల విషయంలోనూ తమ ప్రభుత్వం రూ. 1,904 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం కేవలం రూ. 1,100 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రైల్వే లైన్ల నిర్మాణం కోసం భారీగా నిధులు ఇవ్వాల్సిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కన్నా తక్కువ నిధులు కేటాయించడంతో పాటు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన రైల్వే ప్రాజెక్టులను సైతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే రైల్వే సర్వే పూర్తి చేసుకున్న ప్రాజెక్టుల సైతం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దిగువ పేర్కొన్న ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సంవత్సరాల క్రితమే రైల్వే బోర్డుకు సమర్పించబడ్డాయి. వీటిని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
గద్వాల్-మాచర్ల నవీకరణ (184.20 కి.మీ)
మౌలాలి- భువనగిరి (38 కి.మీ)
మౌలాలి- ఘట్కేసర్ (12.8 కి.మీ)
ఘట్కేసర్ -భువనగిరి (25.2 కి.మీ)
కాచిగూడ- చిట్యాల్ (87 కి.మీ)
గడ్చందూర్- ఆదిలాబాద్ (70.19 కి.మీ)
కృష్ణా – వికారాబాద్ (121.7 కి.మీ)
జగ్గయ్యపేట- మిర్యాలగూడ (36.70 కి.మీ)
పగిడిపల్లి- శంకర్పల్లి (110 కి.మీ)
పటాన్ చెరు- ఆదిలాబాద్ (316.77 కి.మీ)
పాండురంగాపురం- భద్రాచలం పట్టణం (13 కి.మీ)
సికింద్రాబాద్- జహీరాబాద్ (63.5 కి.మీ)
విష్ణుపురం- వినుకొండ (66 కి.మీ)
కరీంనగర్ – హసన్ పర్తి (62 కి.మీ)
కొత్తగూడెం-కొత్తపల్లి (81.57 కి.మీ) మధ్య సర్వే అప్ డేట్.
మహబూబ్ నగర్- గుత్తి (213.41 కి.మీ)
సికింద్రాబాద్- మడిఖేడ్- ఆదిలాబాద్ (383.01 కి.మీ)
సికింద్రాబాద్-కాజీపేట మధ్య 3వ లైన్ (85.48 కి.మీ)
ఘన్పూర్- సూర్యాపేట వయా పాలకుర్తి (91.7 కి.మీ)
బోధన్- లాతూర్ రోడ్ (134.55 కి.మీ)
వికారాబాద్ వద్ద బై-పాస్ లైన్ (2.6 కి.మీ)
యావత్మాల్- ఆదిలాబాద్ మీదుగా ఘంటిగి (125.5 కి.మీ)
ఆదిలాబాద్-ఆర్మూర్ (136 కి.మీ) మధ్య కొత్త లైన్ అప్డేట్
గుంటూరు-బీబీనగర్ మధ్య విద్యుద్దీకరణ (239 కి.మీ)
అకోలా- ధోన్ మధ్య విద్యుదీకరణ (620.27 కి.మీ)
పైన పేర్కొన్న వాటితోపాటు తెలంగాణ గుండా వెళుతున్న ప్రధాన రైలు మార్గాలను అర్థరహిత కారణాలు చెప్పి పక్కన పెట్టడం జరిగింది. వీటిని కూడా వెంటనే మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు.
కరీంనగర్- మానకొండూర్-హుజూరాబాద్- కాజీపేట (61.80 కి.మీ)
మంచిర్యాల- ఆదిలాబాద్ మీదుగా ఉట్నూర్ (160.58 కి.మీ)
మణుగూరు- రామగుండం వయా భూపాలపల్లి (211 కి.మీ)
నంద్యాల-జడ్చర్ల (182.4 కి.మీ)
కోయగూడం గనులు- తడికలపూడి (19 కి.మీ)
భద్రాచలం రోడ్- విశాఖపట్నం (277 కి.మీ)
హైదరాబాద్- శ్రీశైలం అచ్చంపేట వరకు (171 కి.మీ)
సిద్దిపేట- అక్కన్నపేట (50 కి.మీ)
పటాన్ చెరు- సంగారెడ్డి (89.10 కి.మీ)
పగిడిపల్లి వద్ద బైపాస్ లైన్ (10.20 కి.మీ)
ఇప్పటికైనా తెలంగాణ పట్ల వివక్షపూరితమైన వైఖరిని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టాలని కేటీఆర్ సూచించారు. అటు ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్ మేరకు రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల ప్రేమ లేకున్నా కనీసం పార్లమెంటు సాక్షిగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన పునర్విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం 2023 బడ్జెట్లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదించిన నూతన రైల్వే ప్రాజెక్టులకు సైతం భారీగా నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.