Minister KTR | ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం.. శవం లాంటిదని అని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు దింపుడు కల్లం ఆశలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి కేటీఆర్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మున్నేరుపై తీగల వంతెన, ఆర్సీసీ వాల్స్, నగరంలో పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గోళ్లపాడు చానెల్‌పై ఏర్పాటు చేసిన పార్కులను ప్రారంభించారు.
అనంతరం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సభ నిర్వహించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేశారు. సత్తుపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఆరు దశాబ్దాలపాటు పాలించి ప్రజలను పట్టించుకోని పార్టీ ఇప్పుడు ‘ఒక్క ఛాన్స్’ అంటూ ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు. ‘గ్యారంటీలు.. గ్యారంటీలు’ అని ఊదరగొడుతున్న కాంగ్రె స్ పార్టీ నాయకులు, ముందు వారి సీటుకు గ్యారంటీ ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు. తొమ్మిదిన్నరేండ్ల నుంచి పరుగెడుతున్న ప్రగతి రథ చక్రాలు ఇకపై కూడా ముందుకు సాగాలంటే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.

ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ డబ్బు
వచ్చే ఎన్నికల్లో బడా బాబులు రంగంలోకి దిగి ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి డబ్బులు తెప్పిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకోసం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ప్రత్యేక పన్నులు కూడా వేస్తున్నదని ఆరోపించారు. ఎన్ని వందల కోట్లు వచ్చినా తెలంగాణ అమ్ముడు పోయే రాష్ట్రం కాదని స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలేమోగానీ.. మూడు గ్యారంటీలు మాత్రం ప్రజలకు ఖాయం. 1. మూడు గంటల కరెంటు 2. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి విధానం 3. అవినీతి, కుంభకోణాలు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు రూ.కోట్లు వెచ్చించి టికెట్లు కొనుక్కొంటున్నారని విమర్శించారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు దింపుడు కల్లం ఆశలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టువదలని విక్రమార్కుడని, పదేండ్లలో సత్తుపల్లిలో రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని ప్రశంసించారు.
హైకమాండ్.. లో కమాండ్.. న్యూ కమాండ్
కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ప్రజలను దగా చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారని కొనియాడారు. కాంగ్రెస్‌వి గ్యారంటీ పనులు కావని, ‘420’ పనులని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మంలోని ప్రతిపక్షాలను ఫుట్‌బాల్ ఆడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారడం గ్యారంటీ అని అన్నారు. ఆకాశం నుంచి పాతాళం దాకా అవినీతి కుంభకోణాలకు పాల్పడటం గ్యారంటీ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక హైకమాండ్ ఉంటది. గల్లీలో ఒక లో కమాండ్ ఉంటది. ఇప్పుడు కొత్తగా బెంగళూరులో న్యూ కమాండ్ వచ్చింది’ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి పార్టీని వీడిన నేతలు, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓడిపోయినవారికి మంత్రి పదవి ఇచ్చి అందలమెక్కించడమేనా కేసీఆర్ చేసిన తప్పు ? అని ప్రశ్నించారు. జిల్లాలో పార్టీని వీడిన ఇద్దరు నేతల్లో ఒకరిది మహాకవి శ్రీశ్రీలాగా ‘ప్రపంచం బాధంతా ఆయనదైతే..’ మరొకరిది దేవులపల్లి కృష్ణశాస్త్రిలాగా తన బాధ ప్రపంచానికి పంచుతున్నారని చమత్కరించారు. ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో ప్రతి దళిత కుంటుంబానికి దళితబంధు వర్తింపజేస్తామని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటామని చెప్పారు.

రైతును రాజును చేసిన కేసీఆర్
రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తూ సీఎం కేసీఆర్ రైతును రాజు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.43 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతమైందని, నేడు ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్లు అందుతున్నాయని గుర్తుచేశారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నెలనెలా పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక్కరోజే సత్తుపల్లిలో రూ.125 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని,ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో సత్తుపల్లికి నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం నగరం అనూహ్యరీతిలో అభివృద్ధి చెందిందని తెలిపారు. అంజనాపురం పామాయిల్ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 3 వేల మంది ఉపాధి లభిస్తుందని చెప్పారు. గోద్రెజ్ కంపెనీ రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని వెల్లడించారు. రైతాంగం సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్‌పాం వంటి దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే తోటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
గురువును మించిన శిష్యుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ తన గురువు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును మించిన శిష్యుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్ పక్కన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎన్ఆర్ఐలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తిరుగులేని కథానాయకుడిగా కీర్తిగాంచి ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు’ అయ్యాడని కొనియాడారు. తెలుగువాళ్లపై ప్రపంచ దృష్టి పడేలా చేసిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పారు. గురువు ఎన్టీఆర్ చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ చేశారని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో సాధించినా మూడోసారి సీఎం కాలేకపోయారని, ఆ రికార్డును కేసీఆర్ సాధిస్తారని తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అన్నారు.
ఖమ్మం అభివృద్ధి గుమ్మం: అజయ్‌కుమార్
ఖమ్మం ఇప్పుడు అభివృద్ధి గుమ్మంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని రూ.3 వేల కోట్లతో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపామని చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భారీ వర్షం కారణంగా భద్రాచలం పర్యటనను కేటీఆర్ రద్దుచేసుకొన్నారు.