రాష్ట్రంలోని గీత కార్మికులకు సేఫ్టీ మోకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదట ప్రారంభిస్తాం. సేఫ్టీ మోకులకు ఐఐటీ బాంబే సర్టిఫికెట్ ఇచ్చింది. మోకులతో తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదం జరగకుండా రక్షణ ఉండేలా తయారు చేశారు. – మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): చెట్ల పన్ను మాఫీ, ఎక్స్‌గ్రేషియా వంటి గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలోని గీత కార్మికులకు సేఫ్టీ మోకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదట ప్రారంభిస్తామని చెప్పారు. సేఫ్టీ మోకులను ఐఐటీ బాంబే సర్టిఫికెట్ ఇచ్చిందని, మోకులతో తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదం జరగకుండా రక్షణ ఉండేలా తయారు చేసినట్టు వెల్లడించారు. ‘ఇది పని చేసే ప్రభుత్వం.. మీకు పనికొచ్చే ప్రభుత్వం. ఎవరో వచ్చి నాలుగు మాటలు చెప్పంగనే ఆగం కావద్దు.. ఈ ప్రభుత్వం చేసిన పనులను మరిచి పోవద్దు.. అండగా నిలిచి ఆశీర్వదించండి’ అని కోరారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల చౌరస్తాలో రూ.30 లక్షలతో మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన పాపన్న భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మానేరు వాగులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటును ప్రారంభించారు. అనంతరం పద్మనాయక కల్యాణమండపంలో నిర్వహించిన పాపన్న జయంతి సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. 50 ఏండ్లు కరెంటు, సాగు, తాగునీరు ఇలా అన్నింటికీ గోసపడ్డామని, వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. టాటాలు, బిర్లాలు మాత్రమే కాదు.. తాతల నాటి కులవృత్తులన్నీ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నామని వెల్లడించారు.
పాపన్నది ఆత్మగౌరవ పోరాటం
పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. సర్వాయి పాపన్న, అచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ, అచార్య జయశంకర్, అంబేద్కర్, మహాత్మాగాంధీ ఒక్క కులానికో, మతానికో సంబంధించిన నాయకులు కాదని స్పష్టంచేశారు. సర్వాయి పాపన్న ఆత్మగౌరం కోసం పోరాడారని స్పష్టంచేశారు. పది మందితో ప్రారంభించిన ఉద్యమాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ గోల్కొండ ఖిల్లా మీద జెండా ఎగరేసే దాకా పోరాడిన మహాయోధుడని కొనియాడారు. గీత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచిందని చెప్పారు. సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ వినతి మేరకు సంఘానికి రెండు ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గీత కార్మికుల కులవృత్తిని పెంచేందుకు, వృత్తిలో ఉన్నవాళ్లను కాపాడుకునేందుకు గ్రామాల్లో చెట్లను పెంచేందుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లాలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం: శ్రీనివాస్‌గౌడ్
నాగరికత నేర్పిన కులవృత్తులను, నేతన్న, గీతన్న కష్టాలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో గౌడ కులస్తులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారని చెప్పారు. వైన్స్ టెండర్లలో రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా, విలువైన భూమిని గౌడ కులస్తులకు హైదరాబాద్‌లో కేటాయించినట్టు గుర్తుచేశారు. మేలు చేసిన ప్రభుత్వానికి గౌడ కులస్తులందరూ అండగా నిలువాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి రామన్న ప్రాతినిధ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.కేటీఆర్‌కు సిరిసిల్లతో పేగు బంధం ఉన్నదని, రామన్న తమ జిల్లాకు ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్‌టీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా, పట్టణాధ్యక్షుడు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, గౌడ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీనన్న మాటలతో ఉప్పొంగిపోయా..
నాటి సిరిసిల్ల ఎట్లుండె.. నేడు ఎట్లయ్యిందన్న మంత్రి శ్రీనన్న మాటలతో తాను ఉప్పొంగి పోయాయనని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వర జలాలతో ఇయ్యాళ పాపికొండలు, కోనసీమను తలదన్నేలా తయారైందని, ఇక్కడ బ్రహ్మాండంగా సినిమా షూటింగ్‌లు చేపిద్దామంటుంటే తనకు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కడుపు నిండినట్టయ్యిందని పేర్కొన్నారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తయిందని, వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం, బత్తుల చెరువు, గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరుకు నీరు ఎత్తిపోస్తామని చెప్పారు. కేసీఆర్ తెచ్చిన గోదావరి జలాలతో మత్స్య సంపద పెంచుకుని ముదిరాజ్‌లు, గంగ పుత్రులు ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1,001 గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల సాలర్షిప్ అందిసున్నట్టు వెల్లడించారు.