KTR | మహబూబ్‌నగర్ : ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడే మాటల గురించి ఆలోచించకు. వాళ్ల గురించి ఆలోచించి జీవితంలో కొన్ని విలువైన సెకన్లను వృధా చేసుకోకు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. నీ గుణం ఏందో, నీ కులం ఏందో, నీ మతం ఏందో, నీ ఆలోచన ఏందో అన్ని కూడా మనోళ్లకు తెలుసు. తప్పకుండా మీరంతా శ్రీనివాస్ గౌడ్ వెంట ఒక సైన్యంలా ఉండి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఐటీ టవర్‌తో పాటు పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ శీనన్నకు కోపమొచ్చింది. అందుకే శిగమూగిండు. మంచినీళ్లు ఇస్తేకూల్ అయితాడేమోఅనుకున్నా.. కానీ బాగా హాట్ హాట్‌గా ఉండే. గట్టిగా వాయించి వదిలిపెట్టిండు. కోపం తప్పకుండా వస్తది. ఎందుకు వస్తదంటే.. 60, 70 ఏండ్లలో ఎవరు చేయని పని చేసిన తర్వాత, పాలమూరు రూపురేఖలు మార్చిన తర్వాత కూడా ఎవడో తలమాసిన వెధవ వచ్చి ఇక్కడ మన నడిగడ్డ మీద, మన మహబూబ్‌నగర్ గడ్డ మీద నిలబడి మాట్లాడితే కోపం రాక ఎట్ల ఉంటది. 14 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చిన దౌర్భాగ్యులు కూడా వచ్చి, ఇవాళ రోజు నీళ్లు ఇచ్చే శీనన్నను అంటే కోపం రాకుండా ఉంటదా..? తప్పకుండా కోపం వస్తది. మనిషిని దేవుడు పుట్టించిండు. దేవుడు కులాన్ని పుట్టించలేదు. కులాన్ని మనిషే పుట్టించుకున్నాడు. కులం కాదు ముఖ్యం.. గుణం ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నీది. తెలంగాణ ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించిన చరిత్ర నీది. అడ్డగోలు మాటలు మాట్లాడిన థర్డ్ క్లాస్ వ్యక్తి.. ఆనాడు తెలంగాణ వ్యతిరేకులపక్కన తుపాకులు పట్టుకుని తిరిగిన దౌర్భాగ్యుడు. ఆ వ్యక్తితో పోల్చుకునే పనే లేదు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు మనసు గాయపరుచుకునే అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనం ఒకటే నమ్ముతున్నాం. కుల, మత పిచ్చోళ్లను పట్టించుకోవడం లేదు. అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం.. జనహితమే మన అభిమతం అనే నినాదంతో అందర్నీ కడుపులో పెట్టి చూసుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని కేటీఆర్ పేర్కొన్నారు.
శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మహబూబ్‌నగర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. 5,279 ఇండ్లు పూర్తి చేసి పేదవాళ్లకు ఇచ్చానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మరో 3 వేల ఇండ్లు రెడీగా ఉన్నాయి.. అవి కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. గృహలక్ష్మి కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల మందికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షల మంది రైతులకు రైతుబంధు రూపంలో రూ. 1900 కోట్లు ఇచ్చాం. 3653 మంది రైతులకు రూ. 182 కోట్ల రైతుబీమా ఇచ్చాం. రైతులను ఆదుకున్న చరిత్ర బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్ పట్టణం అందంగా మారింది. ఒకప్పుడు ఇరుకు రోడ్లు ఉండేవి. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ పోయే రోడ్డు బాగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో ఉండే శిల్పారామం.. మహబూబ్‌నగర్ పట్టణంలో కూడా వచ్చింది. ఇది కాదా అభివృద్ధి..? ఇది కనబడుతలేదా ఆ సన్నాసులకు. ఆలోచించమని కోరుతున్నాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 26 వేల ఎకరాల్లో జంగల్ సఫారీని ప్రారంభించబోతున్నాం అని కేటీఆర్ తెలిపారు.