నిజామాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కొడంగల్‌లో చెల్లనోడు.. కామారెడ్డిలో చెల్లుతడా?.. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడట’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చురకలంటించారు. కామారెడ్డిలో కేసీఆర్ విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌లాంటి నాయకుడు దేశంలో మరెక్కడా ఉండరని చెప్పారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా నా బిడ్డ అని గుండెలకు హత్తుకుంటారని, అలాంటి కేసీఆర్ మీ (కామారెడ్డికి) దగ్గరికే రావాలని నిర్ణయించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని తెలిపారు.
కామారెడ్డి దశ మార్చేందుకు కేసీఆర్ ఇక్కడికి వచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ మంగళవారం పర్యటించారు. పాత మాచారెడ్డి, పాత కామారెడ్డి మండలాలవారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. భారీ మెజార్టీ లక్ష్యంగా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశనం చేశారు.
తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరిగింది. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా మారింది. ఈసారి గెలువంగనే తెల్ల రేషన్ కార్డుంటే దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టారు. పిల్లలకు మూడో పూట కూడా సన్నబియ్యంతోనే అన్నం లభిస్తుంది. వండి పెట్టుడు, మూతి తుడుసుడు తప్పా అన్నీ కేసీఆరే చేస్తుండు. పుడితే కేసీఆర్ కిట్.. దబ్బన ఏ కారణంతోనో చనిపోతే కేసీఆర్ బీమా.. అంటే పుట్టుక నుంచి చావు దాకా కేసీఆర్ సర్కారు ఆదుకుంటున్నది.
-మంత్రి కేటీఆర్
గోదావరి జలాలను తీసుకొస్తాం
‘ఇక్కడ రైతులందరూ ఒక్కటే కోరుతున్నరు. మాచారెడ్డిలోని భూములకు గోదావరి జలాలు తీసుకురావాలని అంటున్నారు. మంచిప్ప నుంచి ప్యాకేజీ 22 ద్వారా నీళ్లను తీసుకొస్తాం. ఐదారు నెలల్లోనే గోదావరి జలాలతో రైతుల పాదాలను కడుగుతాం.’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక ఇక్కడికి అధికారులు వద్దన్నా వస్తారని చెప్పారు. కాలువలు తవ్వేటప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు వస్తే లక్షలాది మందికి లాభం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం కోసం మిషన్ భగీరథ పాత పైప్‌లైన్ స్థానంలో కొత్త పైపులు మార్చేందుకు రూ.195 కోట్లు మంజూరయ్యాయని, నాలుగైదు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎండాకాలంలో గోస లేకుండా తాగునీరందించే బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ మాట ఇచ్చారు.
కాంగ్రెస్‌కు ఒక్క ఓటేసినా నాశనమే
‘పొరపాటున కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేసినా నాశనమే’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘నేనీ మధ్య పేపర్లో చూశా.. షబ్బీర్‌అలీ సాబ్ పారిపోతున్నారు. ఇక్కడికి రేవంత్‌రెడ్డి వస్తాడంట. కొడంగల్‌లోనే గెలువనోడు ఇక్కడచ్చి గెలుస్తడట. చికెన్‌సెంటర్ ముందుకొచ్చి కోడి తొడ కొట్టిందంట. అట్లనే రేవంత్‌రెడ్డి పరిస్థితి ఉన్నది.’ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి, బీజేపీకి కామారెడ్డి ఉద్యమ సత్తా ఏమిటో చూపెట్టాలని పిలుపునిచ్చారు. వారి డిపాజిట్ గల్లంతు కావాలని అన్నారు. ‘ఉద్యమద్రోహి రేవంత్.. ఉద్యమకారులపైకి తుపాకి ఎత్తినోడు.. కామారెడ్డికి వస్తానంటే ఆయన్ని నమ్మేటోళ్లు పిచ్చోళ్లమా.’ అని ప్రశ్నించారు.
గుజరాత్, ఢిల్లీ గులాంలు మనకెందుకు?
గుజరాత్, ఢిల్లీ గులాంలు మనకు అవసరమా? అని బీజేపీ, కాంగ్రెస్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు ఇయ్యాలని ఆలోచన రాగానే హైదరాబాద్‌లోనే నిర్ణయం తీసుకొని 11 సీజన్లలో 70 లక్షల మంది రైతులకు రూ. 73 వేల కోట్లు ఖాతాలో వేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. 55 ఏండ్లలో కాంగ్రెస్ పుర్రెలో ఈ ఆలోచన ఎందుకు రాలేదని మండిపడ్డారు. నాట్లు వేసే సమయం వచ్చిందంటే సెల్ఫోన్లు టింగ్టింగ్మంటూ ఎకరాకు రూ.5 వేలు మీ ఖాతాలో పడుతున్నాయా? లేదా? అని అడిగారు. ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చే నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు బాత్రూమ్కు పోవాలన్నా ఢిల్లీనుంచే పర్మిషన్ రావాలని, అలాంటోళ్లను నమ్మొద్దని సూచించారు.
55 ఏండ్లు కాంగ్రెస్ పాలన చక్కగా ఉండి ఉంటే.. కరెంట్ చక్కగా ఇచ్చి ఉంటే.. మంచి నీళ్లు ఇచ్చి ఉంటే.. గోదావరి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తే ఈ సమస్యలు ఉంటుండేనా? ఒక్క చాన్స్ అంటే నమ్మొద్దు. ద్రోహులు వారు. నమ్ముదామా?
-మంత్రి కేటీఆర్
మాస్టర్‌ప్లాన్ రద్దు చేశాం
‘కేసీఆర్ వస్తుండని జబ్బలు చరిచినోళ్లు, తొడలు కొట్టినోళ్ల ఫీజులు ఎగిరిపోయాయి. పోటీ చేయాల్నా వద్దా.. తప్పించుకుని ఎట్లా పోదామని ఆలోచిస్తున్నరు.’ అని కేటీఆర్ ప్రతిపక్షాలకు చురకలంటించారు. మొదట్నుంచి కామారెడ్డిలో గులాబీ జెండా తప్పా మిగిలిన జెండా ఎగిరే పరిస్థితి లేదని చెప్పారు. కామారెడ్డిలో పోటీ అంటే పోచమ్మ గుడి ముందర గొర్రెపోతును కట్టేసినట్టేనని ప్రతిపక్షాలకు అర్థమైందని అన్నారు. కేసీఆర్ వస్తుండని ప్రజలే స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని, భవిష్యత్తులో తప్పకుండా కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ వన్ అవుతుందని ప్రజలే అంటున్నారని చెప్పారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేశామని, పాత మాస్టర్‌ప్లాన్ మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు మతిలేని ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సీఎం సభను విజయవంతం చేయాలి
‘మీరే కథానాయకులైతే మాచారెడ్డి మండలం నుంచే 20 వేల మెజార్టీ వస్తుంది. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారు. మిమ్మల్ని దయచేసి కోరేది ఒక్కటే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కామారెడ్డిలో సభను విజయవంతం చేసి చూపించాలి. కేసీఆర్ వెంటే ఉన్నామంటూ మద్దతు తెలపాలి.’ అని కేటీఆర్ కోరారు. రానున్న 30 రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, నేతలు నిట్టు వేణుగోపాల్, ఎంపీపీ నర్సింగరావు, కేసీఆర్ బావ వకీల్ రామారావు, సుభాష్‌రెడ్డి, గంప శశాంక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అంజుమాన్ బ్యాంకోడు దర్వాజాలు ఎత్తుకపోతుండే. కిటికీలు ఎత్తుకపోతుండే. ఆ రోజన్నా వాళ్లకు ఆలోచన వచ్చిందా? పెట్టుబడి ఇయ్యాలె అని కాంగ్రెస్‌వాళ్లు ఆలోచన చేసిండ్రా?
-మంత్రి కేటీఆర్
మా మద్దతు రామన్నకే..
బాబాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం
సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 31: సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌కు రోజు రోజుకు అన్నివర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. తంగళ్లపల్లిలోని బాబాజీ కులస్థులు మంగళవారం సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు అధ్యక్షుడు ఇనుకొండ మారయ్య ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 30న గంపగుత్తగా కేటీఆర్‌కు తమ ఓట్లు వేస్తామని తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని, నామినేషన్ ఖర్చుల కోసం నగదును ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి జగన్, ప్రజాప్రతినిధులు, నాయకులకు అందజేశారు.