KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ పిచ్చోడు ఉన్నడు ప్రగతి భవన్‌ను పేల్చాస్తా అంటున్నడు. మీ జిల్లాలోనే తిరుగుతున్నడు. ఇంకో పిచ్చోడు వాడేమో సెక్రటేరియట్‌ను పేల్చేస్తా అంటున్నడు. ఒకనితోటి ఇంకొకడు పోటీపడుతున్నడు. ‘భూపాలపల్లిలో పిచ్చోడు ఎవడైనా తిరుగుతున్నడనుకోండి.. వాడి చేయిలో రాయి ఉందనుకో.. అటూఇటూ వెళ్లే వారికి ఇబ్బంది అవుతుంది. కానీ, ఇసొంటోళ్ల చేతుల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉంటే రాష్ట్రం మొత్తానికి ఇబ్బంది అవుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు.. వారి మాటలు నమ్మొద్దు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు. మా ఆడబిడ్డలను ఆలోచించాలని కోరుతున్నా’నన్నారు కేటీఆర్.
‘ఒకాయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మరొకాయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. నేను అడుగుతున్నా.. కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే తెలంగాణ వచ్చునా? జై తెలంగాణ అని.. కేసీఆర్ 2001లో గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే తెలంగాణ వచ్చునా? ఆ తెలంగాణనే రాకపోతే వీడెవడు.. వాడెవడు? ఈ ఇద్దరిని ఎవడైనా దేకునా? వీళ్లకు తెలంగాణ కాంగ్రెస్.. తెలంగాణ బీజేపీ అని ఉంటుండెనా? గంజిలో ఈగలెక్క ఒగలు కరీంనగర్లో కార్పోరేటర్. ఇంకో ఆయన రోడ్లు పట్టుకొని ఎక్కడ తిరిగిండో నాకు తెలియదు. కేసీఆర్ పుణ్యమా.. తెలంగాణ ప్రజల పోరాట పుణ్యమా అని రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఓ దుకాణం పెట్టుకొని.. దానికో అధ్యక్షుడు. దీనికో అధ్యక్షుడు. వాళ్లు మాట్లాడే మాటలు చూస్తే చాలా గమ్మతి అనిపిస్తుంది. ప్లీజ్ ఒక్కఛాన్స్ ఇవ్వండి అంటున్నది కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డి మాటలు వింటే ఓ కథ గుర్తుకు వచ్చింది. వెనుకటికి భూపాలపల్లి లాంటి ఊర్లో ఓ పిలగాడుండే. చిన్నప్పటి నుంచి అంతాచెడిపోయిండు. అంతా లంగ సోపతులు, దొంగకథలు, చిన్నప్పటి నుంచి గలీజు పనులు నేర్సుకున్నడు.
చదువు అబ్బలే.. గుట్కా, జర్దాలు బుక్కుడు. అడ్డమైన పనులు చేసుడు. పెరిగి 17 సంవత్సరాల వయసుకు వచ్చిండు. తాగబుద్ధయి.. ఇంట్లో నాయిన జేబుకొట్టబోయిండు. వాళ్ల అమ్మ చూసి పట్టుకుంది. బుద్ధిలేదా? ఇంట్లో దొంగతనానికి కూడా సిద్ధమైనవా సిగ్గు లేదా? అని కొట్టింది. తాగిన మత్తులో వాడు రోకలి బండను తీసుకొని తల్లిని కొట్టిండు. తల్లి సచ్చిపోయిందా. తండ్రి వచ్చి ఎంత పని చేస్తివిరా అని రెండు దెబ్బలేసిండు. వాడు తండ్రిని కూడా కొడితే.. అతనూ చనిపోయిండు. పోలీసులు పట్టుకుపోయి జైలులో పెట్టారు. శిక్ష వేసేందుకు పోలీసులు తీసుకువచ్చి జడ్జి ముందు నిలబెట్టారు. ఆ జడ్జి ప్రశాంతమైన మనిషి. పిలగాన్ని చూసి పిచ్చోడని చెప్పి.. చాలామంది గలీజుగాళ్లను చూసినా.. చాలామంది పనికిమాలినోళ్లను చూసినా.. ఆఖరికి రేవంత్‌రెడ్డిని కూడా చూసినా.. కానీ ఇంత కిరాతకమైనోన్ని చూడలే. సొంత తల్లిదండ్రులను చంపినోన్ని నీకు ఏం శిక్ష వేయాలో నాకు తెల్వది.. నువ్వు చెప్పి కాలవెట్టు అన్నడు. ఇగ అప్పటిదాక రొమ్ము ఇరుసుకొని నిలబడ్డోడు.. ఇగ నేను తల్లిదండ్రులేని అనాథను సార్ అని విడిచిపెట్టమన్నడు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాట్లాడితే నాకు కూడా గట్లే అనిపిస్తుంది’ అన్నారు.
‘ఇక్కడికి వచ్చి నిన్న మొరుగుతున్నడు. రూ.5లక్షలు ఇస్తలేవ్.. ఇది ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నడు. నేను అడుగుతున్నా 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు మీ కిందపెట్టుకున్నప్పుడు మీరేం పీకింన్రు మీరు. గుడ్డిగుర్రాల పండ్లు తోమారా? అప్పుడు ఎందుకు లేదు మీకు సోయి. ఆనాడు భూపాలపల్లిని జిల్లాను చేయాలనే సోయి మీకెందుకు లేదు. మెడికల్ కాలేజీ ఇవ్వాలనే సోయి లేదా? రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ నీళ్లు ఇవ్వాళన్న సోయి ఎందుకు లేదు. ఇవాళ వచ్చి మొరుగుడు కాదు.. చేతనైతే పది సంవత్సరాల్లో ఏం పీకారో నువ్వు.. నీ పార్టీ ప్రజలకు చెప్పు. అంతేగానీ ఇవాళ వచ్చి పిచ్చికుక్కల్లా మొరుగుడు, నోటికి వచ్చినట్లు వాగుడు కాదు.
వెంకటరమణారెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. భారతరాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం.. రెండింట మూడోంతుల లెజిస్లేచర్ పార్టీ టీఆర్ఎస్లో కలుస్తామని స్పీకర్‌కు దరఖాస్తు ఇస్తే.. ఆయన కలుపుకొని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే పని రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అక్కడ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం చేసుకోలేదా? రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే సంసారం.. అదే ఇక్కడ టీఆర్ఎస్ చేస్తే వ్యభిచారమట.. ఇదెక్కడి నీతి. నీకేమన్న రీతి ఉన్నదా రేవంత్‌రెడ్డి. ఏం మాట్లాడుతున్నవో సోయి ఉందా? నీ పార్టీ రాజస్థాన్‌లో బీఎస్పీని కలుపుకుంటే ఒప్పయితది.. ఇక్కడ తప్పయితదా? ప్రజల మనుసు గెలవాలంటే.. అధికారం రావాలంటే ఏం చేసినమో చెప్పాలే.. ఏం చేస్తమో చెప్పాలి. దమ్ముంటే ఆశవాహమైన భవిష్యత్‌ను చూపించి ఓటు అడగాలి’ అన్నారు.
ఈ సందర్భంగా రూ.135కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జీవో కాపీని ఎమ్మెల్యే రమణారెడ్డికి కేటీఆర్ అందజేశారు. మంత్రి దయాకర్‌రావును రూ.25కోట్ల ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారని, మంత్రి స్పందించి మంజూరు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భూపాలపల్లి అభివృద్ధికి రూ.50 అడిగారని, వెంటనే మంజూరు చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. నాయకుడు, ప్రజాప్రతినిధి అంటే.. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేయాలని, వారి ఆలోచన, అవసరం ఏంటో తెలుసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కావాలని కోరారని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమవంతు సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.