Minister KTR | టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కరెంటు విషయంలో కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంపై కేటీఆర్ మండిపడ్డారు. ఐదు దశాబ్దాలు రైతులకు సాగునీరు, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా తెలంగాణను కాంగ్రెస్ అధోగతి పట్టించిందని, ప్రస్తుతం కేసీఆర్ పాలనలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో కరెంటు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సరఫరా విషయంలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై.. సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న వసతులను చూసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రైతులు కేసీఆర్‌కు మద్దతు తెలుపున్నది కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. వ్యవసాయం, ఉచిత కరెంట్‌పై అవగాహన లేమితో రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా అంశంపై 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు సరఫరా తీరు.. 2014 తర్వాత ఉన్న తీరుపై రైతులనే అడుగుతామని.. కాంగ్రెస్ కరెంట్ కావాలా..? సీఎం కేసీఆర్ ఇచ్చే కరెంట్ కావాలా..? అనే అంశంపై చర్చలకు రావాలని.. ప్రజలే తమ తీర్పును చెబుతారన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నీ ఏనాడు పల్లెత్తు మాట కూడా అన్న పాపాన పోలేదన్నారు.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్సేనని, అందులో పని వ్యక్తి అవ్వడంతోనే మోదీ ఒక్క మాట అనడం లేదని ఆరోపించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నారు. గాంధీ భవన్లో ఉన్న గాడ్సే రేవంత్ అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడున్నది వైఎస్సార్ కాంగ్రెస్ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్ అంటూ విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని జగన్ ఆంధ్రాకి తీసుకెళ్లారని, చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుందన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడు విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి ఎడ్లు తెల్వదు.. వడ్లు తెల్వదన్నారు. ఆయనకు తెలిసింది.. క్లబ్బులు, పబ్బులేనన్నారు. రూ.80వేలకోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం ఎలా సాధ్యమని నిలదీశారు. కాంగ్రెస్ రైతు విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సోమవారం నుంచి రైతువేదికల్లో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. పది రోజుల పాటు కొనసాగుతాయన్నారు. మూడు గంటలు నశించాలి.. మూడు పంటలు వర్ధిల్లాలి అన్నారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదని, ప్రతి పాఠశాలనీ కేసీఆర్ ప్రభుత్వమే బాగు చేస్తుందని స్పష్టం చేశారు.