హైదరాబాద్: వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దుడ్డెను కట్టేయండని మరొకరు అంటారని ఎద్దేవాచేశారు. కండ్లముందు కనబడేది నిజం కాదట.. సోషల్ మీడియాలో కనిపించేది, ఢిల్లీ నుంచి వచ్చి చెప్పేవాళ్లది నిజమట అని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరాన్ని ఇంకా బద్నాం చేయడానికి ఇంకొకరు రిపోర్టులు తయారుచేస్తారన్నారు. తెలంగాణలో ఏదీ బాలేదని చెప్పడానికి ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసుల్లో వండివార్చిన వంటకాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేసేలా మోదీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని ఆరోపించారు.
తెలంగాణకు మిగిలిఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ అని, ఆయనను ఇక్కడే ఖతం చేస్తే మహారాష్ట్రకు రాడు, దేశ రాజకీయాల్లోకి రాడనే ఉద్దేశంతో కుట్రలు చేస్తారని చెప్పారు. మరో రెండు విషయాలపై కూడా ఇలాంటి రిపోట్లు వస్తాయన్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో కులం పేరుతో సీఎం కేసీఆర్ కుంపట్లు పెట్టలేదని, మతం పేరుమీద మంటలు, ప్రాంతం పేరుతో పంచాయితీలు పెట్టలేదని చెప్పారు. అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతం, జనహితమే తన అభిమతమంటూ సీఎం కేసీఆర్ ఎక్కడా ఎలాంటి చిల్లర రాజకీయం చేయకుండా ప్రణాళిక ప్రకారం పనిచేసుకుంటూ వస్తున్నారని చెప్పారు. మన జీవితంలో వెలుగులు నింపిన కేసీఆర్ కావాలా.. మరొక్కసారి కరెంటు కష్టాలు, చీకట్లు తెస్తామంటున్న కాంగ్రెస్ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఉన్న 95 శాతం చిన్న, సన్నకారు రైతులో మూడెకరాల లోపు ఉన్నవాళ్లే.. 24 గంటల కరెంటు ఎందుకు మూడు గంటలు చాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. బిచ్చమేస్తున్నట్లు రైతు బంధు ఇస్తున్నారని అంటున్నారని చెప్పారు. ఇక ఆ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని తెలిపారు. ఇదీ కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులకు వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన, రైతులపట్ల ఉన్న ప్రేమ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విద్య, వైద్యం, కరెంటు మంచిగయ్యాయని, కడుపు నిండా సంక్షేమం జరుగుతున్నదని చెప్పారు.

తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏంచేశారో కండ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు. మిషన్ భగీరథ పైలాన్‌ను మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారి పోయిందని కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని.. కానీ ఇప్పుడు నల్లగొండ, సూర్యాపేట, బీబీనగర్‌లో వైద్య విద్య కాళాశాలలు వచ్చాయన్నారు. వీటితోపాటు దేశంలో అత్యంత పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రి పవర్ ప్లాంట్ జిల్లాలోనే ఉందన్నారు.
2014లో వరి ధాన్యం పండించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 14వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి చేరిందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వరిని పండిస్తున్న జిల్లా ఉమ్మడి నల్లగొండ అన్నారు. గతంలో యాదగిరిగుట్ట ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉందో చూడాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామన్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయన్నారు.
ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్. కానీ మునుగోడులో ఎందుకు ఉపఎన్నికలు వచ్చాయో, రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారో.. ఇప్పుడు అదే పార్టీలోకి ఎందుకు తిరిగొచ్చారో ఆయనకే తెలియాలన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబ నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి పేరుచెప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ఆమాత్రం ఓట్లయిన వచ్చాయన్నారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు తిట్టుకున్న రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒక్కటయ్యారని విమర్శించారు. డబ్బుమదంతో రాజకీయాలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ధన రాజకీయాలను తిరస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు బిడ్డలు మరొకసారి తెగువ చూపాలని, రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని, ధనమదాన్ని వంచాల్సిన అవసరం ఉందన్నారు.