Minister KTR | రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘పిల్లలు భవిష్యత్తు కోసం, బంగా రు తెలంగాణ కావాలన్నా, బంగారు భారతదేశం కావాలన్నా విద్యముఖ్యమని భావిం చాం. ఒక్కసారి కాదు. పదిసార్లు అడిగినం. దండం పెట్టినం. దరఖాస్తు పెట్టినం. దేశ మొత్తం మీద 157 మెడికల్ కాలేజీలు మం జూరు చేస్తే, తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా’ అని ప్రధాని నరేంద్రమోదీపై ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీర్ ఫైర్ అయ్యా రు. మోదీ ఇచ్చినా ఇవ్వక పోయినా, ఇక్కడున్న బండి, గుండు ఇంకోడు సహకరించకపోయినా ఏదీ ఆగలేదన్నారు. పూర్తిగా రాష్ట్ర నిధులతో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకుని, దేశానికే దారి చూపే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు. ఎమ్మెల్యేగా దవాఖానను బాగు చేసే కష్టం మరిచిపోయేలా కార్పొరేట్‌కు దీటుగా వైద్యం అందించేందుకు వంద మంది వైద్యులు వచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీలాంటి ప్రమాదకర రోగాలకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా, స్థానికంగా చికిత్స చేయించుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. కేవలం డాక్టర్లే కాకుం డా, ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటు చేసి, వృత్తులలో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో నిర్మించిన మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం సెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా నిర్వహించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత ర్యాలీ, సభకు హాజరై ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడక ముందు నాటి పది జిల్లాల్లో కేవలం 5 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు.
రైతుల పొలాలకు నీళ్లొస్తుంటే కాంగ్రెస్, బీజేపోళ్ల కళ్లెంట నీళ్లొస్తున్నయ్
మధ్యమానేరు, మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తే, 60 ఏండ్లు ఏమి చేయలోనోళ్లంతా ఓర్వలేక పోతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతుల పొలాలకు నీళ్లొస్తుంటే వాళ్లకు కన్నీళ్లొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇక్కడ మన ప్రాంతం పచ్చపడుతుంటే వాళ్ల కండ్లు ఎర్ర బడుతున్నాయని, కడుపు మండుతున్నదని కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ‘సాగునీటితో రైతులు బాగున్నరు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటితో తల్లులు బాగున్నారు. కళాశాలలు వస్తున్నా యి. వస్తున్న కొలువులతో పిల్లలు సంతోషం గా ఉన్నరు. ఇంత మంది ఆనందంగా ఉంటే కొంత మంది ఓరుస్తలేరు. కేసీఆర్‌ని ఎట్లయి నా ఓడించాలని ఆగం చేస్తున్నారు’ అని మం డిపడ్డారు. ‘కాంగ్రెసోడో.. బీజేపోడో మెడికల్ కళాశాల పెట్టాలంటే ఢిల్లీని అడగాలి?. టికెట్లు కావాలన్నా ఢిల్లీ పెద్దలనే అడగాలి. వాళ్లకు పంచాయతీలు అయినా, బాత్రూం వచ్చినా ఢిల్లీ పెద్దలనే అడగాలి’ అని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ బాగుపడ్డదా? బతికి చెడ్డదా? ఆలోచించాలని కోరారు. సిరిసిల్లలో తనను, వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావును మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కన్నతల్లి తనకు జన్మనిస్తే, రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలేనన్నారు. జిల్లాకు నర్సింగ్, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, జేఎన్టీయూ, మెడికల్ కళాశాల, ఆక్వా యూనివర్సిటీలతో జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాఫ్కాబ్ కొండూరి రవీందర్రావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
అమ్మానాన్నలు నన్ను డాక్టర్.. ఐఏఎస్ కావాలనుకున్నరు
‘1993లో నేను బైపీసీ స్టూడెంట్‌ని. 1600 ర్యాంకు వచ్చినా సీటు రాలేదు. మీలెక్క డాక్టర్‌ను కాలేదు. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలని, నాన్న ఐఏఎస్ కావాలని అనుకున్నరు. కానీ అటూఇటూ కాకుండా పొలిటికల్ లీడర్నై ఎమ్మెల్యేనయ్యానంటూ’ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 10వేల ర్యాంకు వచ్చినా తెలంగాణలో ఇపుడు మెడికల్ సీటు వస్తుందన్నారు. వైద్యం కోసం దవాఖానలకు వచ్చే ప్రజలు దేవుళ్లతో పాటు వైద్యులను కూడా మొక్కుతారన్నారు. అంతటి పవిత్ర వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు కష్టపడి చదివి డాక్టర్లుగా ఎదిగి మెరుగైన సేవలందించి తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపు నిచ్చారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల దయతోని ఎమ్మెల్యే అయ్యాయని, కేసీఆర్ దయతోని మంత్రి అయ్యానన్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా తాను జీవితంలో మరిచిపోలేని రోజని గుర్తు చేశారు. తనకు జన్మనిచ్చింది తల్లి అయితే రాజకీయ జన్మనించింది సిరిసిల్ల అని పునరుద్ఘాటించారు.
కేసీఆర్ దయతోనే నా కొడుకు డాక్టరైతుండు
నా పేరు లక్ష్మణ్. నేను వరంగల్ రైల్వేస్టేషన్ దగ్గర 30 ఏండ్ల నుంచి చిన్న హోటల్ నడుపుతున్న. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. హోట ల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు కొడుకులను చదివిస్తున్న. పెద్దకొడుకు అనురాగ్ బీటెక్ చేస్తున్నడు. చిన్న కొడుకు అభిరామ్‌కు నీట్లో 2600 ర్యాంక్ రావడంతో సిరిసిల్ల మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఇదంతా సీఎం కేసీఆర్ దయతోనే. నయాపైసా ఖర్చుపెట్టకుండానే చదువుకొనే అవకాశం వచ్చింది.
– ఏ లక్ష్మణ్,
టీస్టాల్ నిర్వాహకుడు (వరంగల్)పైసా ఖర్చులేకుండానే..
మా నాన్న ప్రసాద్ నేత కార్మికుడు. సాంచాలు నడిపితే వచ్చే ఆదాయంతోనే కుటుంబం గడుస్తున్నది. నేను పట్టుదలతో ఇంటర్ పూర్తి చేసిన. నీట్ పరీక్షకు హాజరైతే మంచిర్యాంకే వచ్చింది. ఇంతకుముందు ఎంబీబీఎస్ చదవడం అంటే మామూలు విషయం కాదు. వేరే దేశాలు, రాష్ర్టాలకు వెళ్లాల్సి వచ్చేది. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇంటి వద్ద ఉంటూనే డాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. అది కూడా పైసా ఖర్చులేకుండానే. మాలాంటి సాధారణ నేతకార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ చదువుకొనే అవకాశం వచ్చిందంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్ల వల్లనే.
– జీ వింధ్యశ్రీ, ప్రగతినగర్, (సిరిసిల్ల)
కేసీఆర్ సారు సల్లంగుండాలె
నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజూ ఆటో నడుపుకుం టూ వచ్చిన పైసలతోనే అతికష్టం మీద బతుకుతున్న. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే చదివించా. నా చిన్నకుమార్తెను డాక్టర్ని చెయ్యాలన్నదే నా కోరిక. అంత స్థోమత మనకెక్కడిదని మా ఇంటావిడ అనేది. కేసీఆర్ సారు ఖమ్మానికి మెడికల్ కాలేజీని ఇచ్చారు. అందులో నా బిడ్డ రమ్యకు సీటొచ్చింది. దీనికంతటికీ సీఎం గారే కారణమని నా బిడ్డ చెప్పింది. ఫీజులు కూడా రూ.27వేలు మాత్రమే చెల్లించాం. తక్కువ ఖర్చుతో మాలాం టి పేదోళ్లకు పెద్ద చదువు అందిస్తున్న కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– కుక్కల రామచంద్రం, ఆటోడ్రైవర్, కమలాపురం, ఖమ్మం జిల్లా
జై తెలంగాణ
స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. శుక్రవారం కామారెడ్డి మెడికల్ కాలేజీ బయట జై తెలంగాణ నినాదాలు చేస్తున్న వైద్య విద్యార్థులు, వైద్య కళాశాల సిబ్బంది