వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండని కేటీఆర్ సెటైర్లు వేశారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
కేసీఆర్ ఆలోచన ఒక్కటే.. మన పిల్లలు బాగుండాలి, భవిష్యత్ తరం బాగుండాలి.. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన రైతులు బాగుండాలి. మన మహిళలు బాగుండాలనేదే కేసీఆర్ తపన అని కేటీఆర్ తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ తాపత్రాయపడుతున్నారని పేర్కొన్నారు. మనం మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మన పిల్లలకు ఉద్యోగాల కోసం.. టెక్స్ టైల్ పార్కు, ఫార్మాస్యూటికల్ పార్క్, మెడికల్ డివైజెస్ పార్కు, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన లైఫ్ సైన్సెస్ జీనోమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
కానీ ప్రతిపక్షాలు, పొలిటికల్ టూరిస్టులు వస్తరు పోతరు. రోజుకు ఒకరు వస్తున్నరు. నిన్న గాక మొన్న ఒకాయన మహబూబ్‌నగర్‌కు వచ్చిండు. నిన్న ఒకాయన వరంగల్‌కు వచ్చిండు.. వాళ్లేదో రాసిస్తే ఆయన చదివి పోయిండు. ఆయనకు ఏం తెల్వదు పాపం.. వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు. ఏదో డైలాగ్ కొట్టాలి.. నాలుగు మాట్లాడాలి.. అవతల పడాలి అనేది వారి ప్రణాళిక అని కేటీఆర్ పంచులు వేశారు.