సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 01:48:58

కృత్రిమ మేధతో కొత్త ప్రపంచం

కృత్రిమ మేధతో కొత్త ప్రపంచం

  • కరోనా నియంత్రణలో కీలక పాత్ర
  • ఏడాదిలో 120కి పైగా కార్యక్రమాలు 
  • 2021లో 30వేల మందిలో నైపుణ్యాభివృద్ధి
  • తెలంగాణ ఇయర్‌ ఆఫ్‌ ఏఐ రిపోర్టు విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవడంలో తెలంగాణకు ముందున్నది. ఆరున్నరేండ్ల పిన్న వయసులోనే.. ఒక్కోరంగంలో మడమ తిప్పకుండా దూసుకుపోతున్న రాష్ట్రం.. కృత్రిమమేధ (ఏఐ)లోనూ ప్రపంచశ్రేణి దేశాల సరసన నిలిచింది. గడిచిన ఏడాదికాలంలో 120 కార్యక్రమాలతో దేశంలోనే ఏఐని వేగంగా అందిపుచ్చుకొని.. దాన్ని వివిధ రంగాలకు విస్తరింపజేసే కృషిని ప్రారంభించింది. వ్యవసాయరంగంలో ఏఐని ఉపయోగించునేందుకు చేపట్టిన చర్యలు వినూత్నం. గతేడాది ఏఐలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం విడుదలచేశారు.

హైదరాబాద్‌, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్థానిక యువతలో నైపుణ్యాలు పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం గతేడాది పలు కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్‌లో ఎంతో ప్రాము ఖ్యం ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఇంటెల్‌, ఐఐఐటీ హైదరాబాద్‌, పీహెచ్‌ఎఫ్‌ఐ, సీ4ఐఆర్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, ఎన్‌ విడియా, మైక్రోసాఫ్ట్‌, వాద్వాణి ఏఐ, ఐఐటీ హైదరాబాద్‌, హెక్సాగాన్‌, ఐఈఈఈ హైదరాబాద్‌, జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ తదితర సంస్థలతో భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తున్నది. ఏడాదిపాటు 120కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, శాంతిభద్రతలు మొబిలిటీ వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2020లో వ్యవసాయరంగానికి ఎక్కువ ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీం తోపాటు టాస్క్‌, టీఎస్‌సీహెచ్‌ఈ (తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా సంబంధిత పరిజ్ఞానంలో స్థానిక యువతలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనిద్వారా భవిష్యత్‌లో స్కిల్‌ గ్యాప్‌ లేకుండా చేయడం సాధ్యం కానున్నది. ప్రగతిభవన్‌లో శనివారం ‘తెలంగాణ ఇయర్‌ ఆఫ్‌ ఏఐ-2020 అండ్‌ బియాండ్‌' సక్సెస్‌ రిపోర్టు ను ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు.. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కలిసి విడుదలచేశారు. గత ఏడాది జనవరి 2న ‘ఏఐ సంవత్సరంగా ప్రకటించుకున్నామని, ఇప్పుడు ఏఐ సాధించిన విజయాలను పంచుకుంటూ రిపోర్టు విడుదల చేయడం సంతోషంగా ఉన్నదన్నారు.

హెల్త్‌కేర్‌, మొబిలిటీకి ప్రాధాన్యం

హెల్త్‌కేర్‌, మొబిలిటీ విషయంలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటె ల్‌, ఐఐఐటీహెచ్‌ హైదరాబాద్‌, పీహెచ్‌ఎఫ్‌ఐ ఇతర భాగస్వామ్య సంస్థలు కలిసి అప్లయిడ్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశాయి. హెల్త్‌కేర్‌ రంగంలో డయాగ్నోస్టిక్స్‌, ప్రోయాక్టివ్‌ పబ్లిక్‌ హెల్త్‌, హెల్త్‌ సర్వీసెస్‌ ఆప్టిమైజేషన్‌, ఎవిడెన్స్‌ బేస్డ్‌ సోషల్‌ బేస్డ్‌ పాలసీ, ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ డిస్కవరీ అంశాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం లభించింది.


వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలకపాత్ర

కరోనా సమయంలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు వైరస్‌ వ్యాప్తి జరగకుండా అడ్డుకోవటంలో కీలకపాత్ర పోషించాయి. కొవిడ్‌-19 యాప్‌ వల్ల పూర్తి సమాచారం ఒకే వేదికపై అందించడం సాధ్యమైంది. టెలిమెడిసిన్‌, సొంతంగా కొవిడ్‌ ప్రాథమిక పరీక్ష నిర్వహించుకునేలా రూపొందించిన చాట్‌బోట్‌లు విశేష సేవలందించాయి. ఫేస్‌ మాస్కులు లేనివారిని గుర్తించేందుకు రూపొందించిన ఏఐ ఆధారిత ఆవిష్కరణ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు దోహదపడింది. ఇక మొబిలిటీ రంగంలో అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ, అటానమస్‌ నావిగేషన్‌, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీస్‌, సెన్సింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, డెలివరీ అండ్‌ సైప్లె చైన్‌ ఆటోమేషన్‌ విషయాల్లో సమస్యల పరిష్కారానికి ఏఐ ఆధారిత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదేవిధంగా అగ్రికల్చర్‌ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగాల్లో ఆవిష్కరణల కోసం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ సంస్థలు వర్చువల్‌ మల్టీడిసిప్లినరీ సెంటర్‌ను ఏర్పాటుచేసి కృషి చేస్తున్నాయి.

వ్యవసాయరంగ సమస్యలకు ఏఐ

వ్యవసాయ ప్రాధాన్యమైన తెలంగాణ రాష్ట్రం లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు మార్గం చూపేలా నూతన ఆవిష్కరణలు చేయడాన్ని ఐటీశాఖ లక్ష్యంగా ఏర్పరుచుకున్నది. రైతులకు, వ్యవసాయశాఖలోని విధాన నిర్ణేతలకు లబ్ధి చేకూరేలా ఏఐ ఆధారిత ఆవిష్కరణల అభివృద్ధిపై దృష్టి సారించింది. భారత వ్యవసాయరంగంలో విప్లవం తీసుకువచ్చేలా డిజిటల్‌ పరిష్కా రం చూపేందుకు వివిధ పరిశోధనా సంస్థలతో కృషిచేస్తున్నది. ఉత్పాదకత, సుస్థిరత, సమ్మిళిత, సామర్థ్యం తదితర అంశాల్లో జరుగుతున్న పరిశోధనలు మంచి పరిష్కారాలను చూపనున్నా యి. ప్రభుత్వ చొరవ కారణంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పలు వ్యవసాయ పరిశోధన కంపెనీలు ఆ రం గంలో ఆవిష్కరణల కోసం కృషి చేస్తున్నాయి. సాధారణ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌, పంటల నాణ్యత పరిశీలన, రసాయన పరీక్షల నిర్వహణ వంటివి చేసే ఆవిష్కరణలు పైలట్‌ ప్రాజెక్టు దశలో ఉన్నాయి.

ఏఐ ప్రాధాన్యాన్ని ముందే గుర్తించాం

ప్రపంచ దేశాల వేగవంతమైన పురోగతికి దోహదపడే ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’ ప్రాధాన్యాన్ని ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిని ‘ఏఐ సంవత్సరం’గా ప్రకటించుకున్నది. కరోనా  క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ఏఐ కీలక పాత్ర పోషించింది. ఏఐ పోటీలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ఇది ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. ఏఐలో తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం ఆరు అంచెల వ్యూహాన్ని నిర్దేశించుకున్నది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు ముసాయిదాను అమలుచేయడానికి టీ-ఎయిమ్‌ (తెలంగాణ కృత్రిమ మేధస్సు మిషన్‌)ను ఏర్పాటు చేసింది. గతేడాది మాదిరిగానే 2021లో కూడా ఏఐ టెక్నాలజీలో 30వేల మంది యువతలో నైపుణ్యాలు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

- ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌


logo