రంగారెడ్డి, మార్చి 25(నమస్తే తెలంగాణ): పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం పెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లిన ప్రశాంత్‌రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రజాప్రతినిధి కావాలనే నాయకుడు ప్రజల ఆశయాలు, ఆలోచనలకు ప్రతినిధిగా ఉండాలని సూచించారు. నాలుగు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత టర్మ్ అయిపోగానే దిగిపోయే నాయకుడు ప్రజాప్రతినిధి కాడని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసినవాడే నిజమైన నాయకుడని తెలిపారు.
ఎనిమిదేండ్లలోనే అద్భుత ప్రగతి
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఎనిమిదేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచం తనవైపు తిరిగి చూసేలా, దేశమంతా తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠాలు నేర్చుకొనేలా పురోగతి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని అప్పటి నాయకులు దుష్ప్రచారం చేశారని, కానీ, ఇప్పుడు హైదరాబాద్, పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లో భూముల ధరలు పెరిగాయని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వందలాది విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్‌లో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు కానున్నదని తెలిపారు. యాచారం మండలం ముచ్చర్లలో ఇంకా మరెన్నో ఫార్మా కంపెనీలు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. మంచాల మండలంలో సైతం ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఏరో స్పేస్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ కంపెనీలతో వేలాదిమంది స్థానికులు, ఔత్సాహిక యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
జాతీయస్థాయిలో అత్యుత్తమ గ్రామాలు మనవే
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనా సరళితో రాష్ట్రంలోని గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మనదగ్గరే ఉన్నాయని కేంద్రమే చెప్పిందని అన్నారు. కేంద్రం.. జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే టాప్ 20లో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయని చెప్పారు. అలాగే, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కూడా మన మున్సిపాలిటీలు ఉన్నతస్థాయిలో నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణలో హనుమంతుడు లేని గ్రామం, కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గర్భిణులకు పౌష్టికాహారం, పుట్టిన బిడ్డలకు కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, ఎదిగిన ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
26
సొంత జాగాలో ఇల్లు కట్టుకొనే వారి కోసం త్వరలో గృహలక్ష్మి పథకాన్ని సైతం ప్రారంభించనున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైనదని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికే కాలువల తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి ద్వారా ఇబ్రహీంపట్నానికి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని, అలాంటి నాయకుడిపై, ప్రభుత్వ తీరుపై బురద జల్లేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని మండిపడ్డారు. తల్లిదండ్రి లేని ఆ పార్టీలు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేవని, ప్రజల అండ, విశ్వాసం తమకు అమితంగా ఉన్నాయని చెపారు. మాకో చాన్స్ ఇవ్వాలని గింజుకుంటున్న పార్టీలు.. ఏండ్లపాటు పాలించి ఏమి చేశాయని? వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీజీ ‘జన్ ధన్’ ఎక్కడ?
‘జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసుకోండి.. ధనా ధన్ రూ.15 లక్షలు మీ ఖాతాలో పడతాయన్న మోదీజీ.. ఆ డబ్బులు ఎవరి ఖాతాలో వేశారో చెప్పండి?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జన్ ధన్ డబ్బులన్నీ ‘అదానీ’ ఖాతాలోనే పడ్డాయని చురకలంటించారు. 9 ఏండ్ల పాలనలో 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చిన మోదీ, కనీసం 18 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నోట్ల రద్దుతో నల్ల ధనం వెలికి తీస్తా అంటూ ప్రగల్భాలు పలికిన మోదీజీ బ్లాక్‌మనీని ఎక్కడి దాకా తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు. నల్లధనం ఎక్కడ అని అడిగితే మోదీ తెల్ల ముఖం వేస్తున్నారని విమర్శించారు.
పేపర్ లీకేజీ దోషులను వదిలిపెట్టబోం
కేంద్ర సర్కారు మెడలు వంచి ప్రభుత్వ కొలువుల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన కేసీఆర్ తమకు అండగా ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ అయ్యింది వాస్తవమేనని, వెంటనే ఆయా పరీక్షలను రద్దు చేశామని చెప్పారు. జరిగిన నష్టానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. టీఎస్పీఎస్సీతో విద్యాశాఖకు, ఐటీ శాఖకు సంబంధం ఉండనే ఉండదని, అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. కేవలం నిధులు, కార్యదర్శి రూపంలోనే ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. ఈ ఇంగితజ్ఞానం కూడా లేనివారు ప్రతిపక్షంలో ఉండటమనేది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
27
ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దు..
‘రాష్ట్రవ్యాప్తంగా ఉండే తమ్ముళ్లు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా..ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోకండి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగార్థులపై తమకు, సీఎంకు ప్రేమ ఉన్నందునే తప్పులు జరుగొద్దన్న ఉద్దేశంతో పరీక్షలను రద్దు చేశామని చెప్పారు. నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. లోటుపాట్లను సవరించుకొని బ్రహ్మాండంగా ముందుకుపోతామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను ఆపే కుట్ర జరుగుతున్నదని, అందుకే ప్రతిపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. వారి మాటలు విని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
జన జాతరగా సభాస్థలి
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రగతి నివేదన పాదయాత్ర ముగింపు సభ జన జాతరగా సాగింది. అనుకున్నదానికంటే దాదాపు 20 వేల పైచిలుకు జనం తరలివచ్చారు. సభా వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సాయిచంద్ పాడిన పాటకు సభా ప్రాంగణంలో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ అనితా హరినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, దాసోజు శ్రవణ్, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్, బీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది హుషార్ తెలంగాణ
రైతుల ఆదాయం డబుల్ చేస్తానని మోదీ చెప్పారని, కానీ అన్నదాతల కష్టాలు డబుల్ అయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా అసమర్థ ప్రధాని ఉన్నారంటే.. అతను మోదీనే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా లేవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు పాతరేస్త లేరా? అని నిలదీశారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండికొడుతూ మా తమ్ముళ్ల నోట్లో మట్టికొడుతూ.. మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే నమ్మేందుకు ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదు.. ఇది హుషారైన తెలంగాణ’ అని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ అని, బీజేపీ నాయకుల చిల్లరమల్లర మాటలకు పడిపోయే తెలంగాణ కాదని చెప్పారు.
మోదీ ఇంటి ఎదుట నిరుద్యోగ మార్చ్ చేయాలి
బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ నేతలు నిరుద్యోగుల కోసం ధర్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సిగ్గులేకుండా ధర్నా చేస్తున్న బీజేపీ నాయకుల్లారా..మోదీ కనీసం18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ మార్చ్ ఇక్కడ కాదు.. ఢిల్లీలోని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట చేయండి’ అని సూచించారు.
పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. 75 ఏండ్ల భారత చరిత్రలో అన్నదాతలకు పెట్టుబడి సాయం ఇచ్చిన రాష్ర్టాలు ఎక్కడా లేవని పేర్కొన్నారు. పంట సాయం రూపేణా ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున 65 లక్షల మంది రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రైతుకు ఏదైనా జరగరానిది జరిగితే బీమా పేరిట రూ.5 లక్షలు అందిస్తున్నదని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్తుతోపాటు మరిన్ని పథకాలతో అన్నదాతకు అండగా నిలుస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తలసరి ఆదాయం లక్షా 24 వేలు ఉంటే.. ఈ ఎనిమిదేండ్లలో 3.17 లక్షలకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సాయం ముందు మోదీ ప్రభుత్వం చేసే సాయం ఎంత? అని ప్రశ్నించారు.