Minister KTR | కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు. బుధవారం కరీంనగర్‌లోని జరిగిన ప్రజాఆశ్వీరాద సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాడు కేసీఆర్ నిరాహార దీక్ష కరీంనగర్లో ప్రారంభిస్తే, అల్గునూరు చౌరస్తాలో అరెస్టు చేయటంతో అగ్గి రాజుకున్నదని, ఆ అగ్గి తెలంగాణ సాధించేవరకు సాగిందని వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి అగ్గి రగిలించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ఓట్ల అగ్ని కీలల్లో బీజేపీ, కాంగ్రెస్ దహించుకుపోవాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీలకు ఓటేస్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణ మరో 50 ఏండ్లు వెనక్కి వెళ్తుందని చెప్పారు. గత తొమ్మిదినరేండ్లలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే కాదు, కరీంనగర్లో వచ్చిన మార్పు ప్రజల కండ్ల ముందే ఉన్నదని, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, సాగు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కారం అయ్యాయని వివరించారు. కాళేశ్వరంతో మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, అప్పర్‌మానేరు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని తెలిపారు.
కేసీఆర్ హిందువు. ఏనాడు మతాన్ని, ధర్మాన్ని దాచుకోలేదు. ప్రధాని మోదీ సైతం చేయని చండీయాగం చేసి హిందువునని అని గర్వంగా చెప్పుకున్నారు. కానీ, ఏనాడైనా మతం పేరుతో రాజకీయాలు చేశారా? కేసీఆర్ ఏ ఒక్క వర్గానికో మతానికో సీఎం కాదు. సబ్బండ వర్గాలు, కులాలకు నాయకుడు.
– మంత్రి కేటీఆర్
‘మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా ఆలోచన చేసి సీఎం కేసీఆర్‌కు ఓ మాట చెప్పారు. రాష్ర్టాన్ని మీ నాయకత్వంలో అన్నపూర్ణగా చేశారు. దేశానికే అన్నం పెట్టే తెలంగాణలో మన బిడ్డలకు కడుపు నిండా సన్నబియ్యంతో బువ్వ పెడుదాం’ అని గంగుల చెప్తేనే అన్నపూర్ణ అనే కొత్త పథకాన్ని సీఎం తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త పథకాన్ని కేసీఆర్ తీసుకొస్తున్నారని, దీంతో 93 లక్షల తెల్లకార్డుదారులకు ప్రభుత్వమే బీమా కల్పించనున్నదని వివరించారు. ప్రజలు ఆశీర్వదించి మరో అవకాశం ఇస్తే ఆరు నెలల్లో బీమాను ప్రారంభం చేస్తామని ప్రకటించారు.
తొమ్మిదిన్నరేండ్లలో 2.20 లక్షల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన పోస్టులూ భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. అవసరమైతే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తాం.
– మంత్రి కేటీఆర్
మత రాజకీయాలు చేసేవాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో ఓట్లు అడిగితే చెంపపెట్టులాంటి తీర్పు ఇవ్వాలని తెలిపారు. ఎంపీ అయినప్పటి నుంచి బండి సంజయ్ కరీంనగర్‌కు ఒక్క పైసా పనైనా చేశారా? అని నిలదీశారు. మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమారే టీటీడీ బోర్డు వద్దకు వెళ్లి, వారిని ఒప్పించి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొంతమంది చిల్లర రాజకీయం కోసం ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేశారని మండిపడ్డారు. ‘బుధవారం అమ్మాయి తల్లిదండ్రులు, తమ్ముడు నా వద్దకు వచ్చి అన్నా.. మా బిడ్డకు అన్యాయం జరిగింది. ఒకాయన వేధించి చంపిండు. న్యాయం చేయాలి అని కోరారు. వాళ్లకు ఒక్కటే హామీ ఇచ్చిన. మీరు బాధ పడకండి. మీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం’ అని చెప్పానని వివరించారు.
మసీదులు తవ్వుదాం.. శవం వస్తే మీది.. శివం వస్తే మాది అంటూ రెచ్చగొడుతున్నారు. ఎంపీగా గెలిపించింది మసీదులు తవ్వేందుకేనా? ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత తవ్వాల్సింది మసీదులు కాదు. అభివృద్ధి పనుల కోసం పునాదులు.
– మంత్రి కేటీఆర్
అందరి అభిమాన నాయకుడు, కాబోయే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అని కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తొమ్మిదిన్నరేండ్లలో కరీంనగర్‌ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత సుదరంగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. గంగులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కమలాకర్‌పై పోటీ చేయడమంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని భయపడి పారిపోతున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలుగా సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చావు నోట్లో తల పెట్టి కరీంనగర్లో నిరాహార దీక్ష చేపట్టి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చి తొమ్మిదిన్నరేండ్లలోనే రాష్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా చేసిన నాయకుడు కేసీఆర్ ఒకవైపు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయుమంటే అమెరికా పారిపోయిన కిషన్‌రెడ్డి. ఓటు నోటు కేసులో దొరికిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు మరోవైపు ఉన్నారు. వాళ్లకు ఓటేద్దామా? తండ్రి లాంటి కేసీఆర్ చేతికి రాష్ర్టాన్ని ఇద్దామా?
– మంత్రి కేటీఆర్
రాష్ర్టాన్ని ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రగతి ఆగిపోతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక అంధకారం అవుతుందని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ ముసుగులో హైదరాబాద్‌లో తిష్ట వేశారని, తెలంగాణ ఏర్పాటును పచ్చిగా వ్యతిరేకించిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఈ గడ్డ మీద నిలబడ్డారని తెలిపారు. ప్రజల్లో ఎవరున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో గమనించాలని వ్రిజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీలు రాష్ర్టానికి ఏం చేశాయి? తొమ్మిన్నరేండ్ల బీఆర్ఎస్ ఏం చేసింది? అన్న చర్చ జరగాలని అన్నారు.