KTR | యాదాద్రి భువనగిరి : నరాలను పోగులుగా చేసి.. రక్తాన్ని రంగుగా మార్చి.. గుండెల్ని కండెలుగా చేసి.. చెమట చుక్కల్ని చీరలుగా మార్చి.. పేగుల్ని వస్త్రాలుగా అందించి.. మనషులకు నాగరికత అద్దిన నేత కార్మికులందరికీ హృదయపూర్వకంగా సలామ్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేతన్నకు ప్రతీక మగ్గం అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు నేతన్నల కష్టాలు తెలుసు. నేతన్నల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరిట పొదుపు పథకం తీసుకొచ్చాం. రైతుబీమా తరహాలో నేతన్నకు బీమా తెచ్చాం. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్లే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు.
కనుముక్కులలో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు మూతబడ్డదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. నేతన్నలకు అక్కడ ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. వెంటనే పన్నెండున్నర కోట్లతో ప్రభుత్వమే కొనుగోలు చేసి, దాని తిరిగి తెరవబోతున్నాం. చేనేత మిత్ర ద్వారా నెలకు రూ. 3 వేల చొప్పున ప్రతి కార్మికుడికి వచ్చే నెల నుంచి మీ ఖాతాల్లో జమ చేయబోతున్నాం. నేతన్నకు బీమా అర్హతను 75 ఏండ్లకు పెంచామన్నారు. దీని వల్ల వేలాది మంది నేతన్నలకు లాభం జరగనుంది. నేతన్నకు చేయూత ద్వారా.. 26 వేల కుటుంబాలకు రూ. 96 కోట్లను మెచ్యూరిటీ పూర్తి కాకుండానే కరోనా కాలంలో ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ చేనేత హెల్త్ కార్డు ద్వారా ఓపీ సేవల కోసం రూ. 25 వేలు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. మగ్గాలు ఆధునీకరించుకోవాలి. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ లూమ్స్ తీసుకొస్తున్నాం. దీన్ని రూ. 40 కోట్లతో చేనేత మగ్గం అనే కార్యక్రమం కింద తీసుకొచ్చాం. ఇవన్నీ మీ కోసం తెచ్చిన పథకాలు.. వాడుకుంటే మీకే లాభం. మగ్గాలు నేసే నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డు ద్వారా.. పథకాల ప్రయోజనాలు పొందుతారు. గతంలో ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే దహనసంస్కారాల నిమిత్తం టెస్కో నుంచి రూ. 5 వేలు అందించేవారు. కానీ ఇప్పుడు రూ. 25 వేలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది అని కేటీఆర్ తెలిపారు. ఉప్పల్లో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు 22 ఎకరాల్లో ఉంది. దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాం. దాంట్లో వచ్చే లాభాలను మీ పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికి అందిస్తాం. ఆ ఓనర్షిప్ను మీకే అప్పజెప్తాం. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అధిక మందికి ఉపాధి కల్పిస్తుంది. అగ్గిపెట్టె లో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు. అందుకే మీ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. మాది కోతల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. 2001లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు.