ఆర్ఏ కెమ్, అవ్రాలో అడ్వెంట్ పెట్టుబడి 1,750 కోట్లు
హైదరాబాద్‌లో స్లేబ్యాక్ విస్తరణ ప్లాన్ 1,500 కోట్లతో
ఫార్మా కొపియా, క్యూరియా గ్లోబల్ సంస్థల రాక
రాష్ర్టానికి తరలిరానున్న అమెరికన్ ఫార్మాకంపెనీలు
కేటీఆర్‌తో భేటీ తర్వాత పెట్టుబడిపై ప్రకటనలు
అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్, మార్చి 27 : ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప్రారంభించగా, ఆదివారం మరో నాలుగు అమెరికా దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించాయి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం అనంతరం ఈ నాలుగు ప్రఖ్యాత కంపెనీలు దాదాపు రూ.3,250 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేశాయి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రాష్ట్రంలోని ఫార్మా రంగంలో రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మంత్రి కేటీఆర్ అడ్వెంట్ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో ఆదివారం సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) సంస్థల్లో మెజారిటీ వాటాలు కొనేందుకు రూ.1,750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఈ సందర్భంగా మాల్డోనాడో తెలిపారు. ఆర్ఏ కెమ్ సంస్థ ఔషధాల్లో ప్రభావవంతమైనవిగా పరిగణించే పెల్లెట్స్ తయారీతోపాటు బీ టూ బీ ఫార్ములేషన్స్, క్లినికల్ స్టడీస్ రంగంలో పనిచేస్తున్నది. 1984లో స్థాపించిన అడ్వెంట్ కంపెనీ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక, రిటైల్, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో సుమారు రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
20 మిలియన్ డాలర్లతో స్లేబ్యాక్..
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో 20 మిలియన్ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. సీజీఎంపీ (cGMP) ల్యాబ్‌తోపాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది. గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో స్లేబ్యాక్ సుమారు రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం తరువాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జెనరిక్ ఔషధాల తయారీ అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత తమ కంపెనీదని వెల్లడించారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్ 5 ఎంఎల్ జెనరిక్ ఔషధాన్ని అమెరికన్ మారెట్లో తొలిసారి ప్రవేశపెట్టింది తామేనని పేర్కొన్నారు. ఈ కంపెనీ 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 3 యూనిట్లలో 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
జీనోమ్ వ్యాలీకి ఫార్మా కొపియా
హైదరాబాద్ ఫార్మా రంగంలోకి యునైటెడ్ స్టేట్స్ ఫార్మా కొపియా సంస్థ కూడా చేరనున్నది. రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔష ధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్టు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కేవీ సురేంద్రనాథ్ తెలిపారు. గత ఐదేండ్లలో ఇక్కడ 5 మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టి 70 మందికి ఉద్యోగాలు కల్పించామని, తాజాగా ఏర్పాటుచేయనున్న అడ్వాన్స్డ్ ల్యాబ్‌లో మరో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని వెల్లడించారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేసే అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని వివరించారు.
గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ విస్తరణ
న్యూయార్ కేంద్రంగా గల క్యూరియా గ్లోబల్ (గతంలోAMRI Global ) హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించి ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలోగా రెట్టింపు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ మనదేశంలో 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్ట్ పార్టీ సంస్థల కోసం ఔషధ తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులున్నారు.
ముగిసిన పర్యటన
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న పలు కంపెనీల నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పెట్టుబుడులతో వచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు మరింత సమర్ధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ ఉన్నారు.
తెలంగాణలో ఉత్తమ వ్యాపార వాతావరణం
నీతి ఆయోగ్ మాట ఇది
ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ (ఈపీఐ-2021)లో అత్యుత్తమ వాణిజ్య, వ్యాపార మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అత్యధిక వస్తు సేవలు ఎగుమతి చేస్తున్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు సంపాదించిందని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రశంసలపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది’ అని ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి ట్వీట్‌కు జోడించారు.