మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:17

ప్రగతిశీల తెలంగాణకు పెట్టుబడులతో రండి

ప్రగతిశీల తెలంగాణకు పెట్టుబడులతో రండి

  • తెలంగాణలో బలమైన ఎకో సిస్టమ్‌
  • లైఫ్‌సైన్సెస్‌, ఫార్మాకు అనుకూలం
  • అమెరికాకు కరోనా మందులు ఇక్కడివే 
  • యూఎస్‌ఐబీసీ వెబినార్‌లో కేటీఆర్‌
  • రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అమెరికన్‌ 
  • పారిశ్రామికవేత్తల ప్రశంసలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం తెలంగాణలోని కంపెనీలు ఉత్పత్తిచేసే ఔషధాలపై ఆధారపడుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగానికి అనుకూలమైన వ్యవస్థ బలంగా ఉన్నదని తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ర్టాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రగతిభవన్‌ నుంచి గురువారం యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) ఇన్వెస్ట్‌మెంట్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ.. పెట్టుబడి అవకాశాలకు, పరిస్థితులకు తెలంగాణ వంటి రాష్ర్టాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని అనేక రాష్ర్టాలకు భిన్నంగా తనదైనశైలిలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని చెప్పారు. దేశంలోనే అత్యంత తక్కువ వయస్సు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, నూతన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలపరంగా వినూత్నమైన పంథాలో ముందుకుపోతున్నదని తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఈవోడీబీ ర్యాకింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

టీఎస్‌ఐపాస్‌ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే ఈ విధానం విజయవంతమైందని చెప్పారు. అనుమతులు ఇచ్చినవాటిలో 80 శాతానికిపైగా సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ వంటి 14 రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించిందని చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. 

సంక్షోభంలో అండగా నిలిచాం

ప్రస్తుత కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలిచిందని చెప్తూ.. అందుకు తాము తీసుకున్న చర్యలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్‌, ఫార్మారంగానికి బలమైన ఎకో సిస్టం ఉన్నదన్నారు. ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం రాష్ట్రంలోని కంపెనీలు ఉత్పత్తిచేసే కరోనా మందులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారతదేశంలోని అతిపెద్ద మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌ తెలంగాణలో ఉన్నదని ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

పెట్టుబడులకు సహకరిస్తాం: నిషా బిశ్వాల్‌ 

తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని యూఎస్‌ఐబీసీ ప్రెసిడెంట్‌ నిషా బిశ్వాల్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి పెట్టుబడులు తేవడంలో యూఎస్‌ఐబీసీ అండగా ఉంటున్నదని, భవిష్యత్తులోనూ దీన్ని కొసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిషా బిశ్వాల్‌ తెలంగాణ ప్రభు త్వ విధానాలు, పరిశ్రమలకు అందిస్తున్న చేయూతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా సంక్షోభం తరువాత తెలంగాణకు వచ్చే పెట్టుబడుల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ వెబినార్‌లో ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎనర్జీ, రిటైల్‌ వంటి రంగాల నుంచి పదుల సంఖ్యలో పెట్టుబడిదారులు, కంపెనీల అధినేతలు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న వాతావరణాన్ని ఇన్వెస్ట్‌మెం ట్‌ వెబినార్‌లో పాల్గొన్న అమెరికన్‌ కంపెనీల అధినేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీఎస్‌ఐపాస్‌ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతుపై తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందుతున్నదని వారు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకరమైన విధానాలు, పరిపాలన, శాంతిభద్రతలు, మావన వనరులు, రాయితీలు, సబ్సిడీలు అందుతున్నాయని వారు తెలిపారు. 


logo