CM KCR | హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ దశను మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని, ఇందుకోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తన ఆలోచనలు, కలలకు వాస్తవరూపం ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణది ఓ సంపూర్ణమైన విజయ గాథ అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మేటిగా నిలిచిందని తెలిపారు. సోమవారం అమెరికాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023 సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్- 2023కి తనను ఆహ్వానించినందుకు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) నాయకత్వ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోనే అతి చిన్న వయసున్న తెలంగాణ విజయ ప్రస్థానాన్ని 2017లోనే ఈ సదస్సు ముందు ఉంచానని, ఇప్పుడు మరోసారి ఆ అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. 2014కి ముందు ఉన్న తెలంగాణకు, ప్రస్తుతం మన ముందు సాక్షాత్కారమైన తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉన్నదని వెల్లడించారు. కరువు కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతం ఇప్పుడు సీఎం కేసీఆర్ దార్శనికతతో సుభిక్షంగా మారిందని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదేండ్లలో తెలంగాణ అసాధారణమైన మైలురాళ్లను సాధించిందన్నారు. అతి పెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మాణం, మిషన్ భగీరథతో ఇంటింటికీ ఉచిత తాగునీరు అందించడంతో పాటు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగిన రాష్ట్రంగా నిలిచిందని, ధాన్యం ఉత్పత్తిలో రెండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. ఇక దేశంలో ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తన ప్రత్యేకత చాటుకున్నదని వెల్లడించారు.
2014కు ముందు తెలంగాణలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎండిపోయిన చెరువులు, ఖాళీ బావులు ఇలా తీవ్రమైన నీటి కొరతతో ఈ ప్రాంతం అల్లాడిందని భూగర్భ జలాలు అట్టడుగుకు చేరి విపరీతమైన నీటి కొరతతో తాగడానికి మంచినీళ్లు కూడా లభించని పరిస్థితి ఉండేదని వెల్లడించారు. దీనికి తోడు వ్యవసాయ బోర్లు ఫెయిల్ కావడం, ఇతర నీటి పారుదల సౌకర్యాలు లేకపోవటంతో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని వివరించారు. దీంతో రైతులకు బతుకుపై భరోసా సడలి వలసలు, ఆత్మహత్యలు విషాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నుంచి రైతులకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు, రాష్ట్ర భవితవ్యాన్ని మార్చేందుకు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఇందులో భాగంగానే దశాబ్దాల నాటి తెలంగాణ నీటి సమస్య పరిషారానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ‘కాళేశ్వరం’ను విజయవంతంగా నిర్మించారని తెలిపారు. అనేక అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టును అత్యంత సమర్థత, తక్కువ ఖర్చుతో రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని కేవలం రూ.88 వేల కోట్ల ఖర్చుతో నాలుగేండ్ల వ్యవధిలోనే నిర్మించి దిగువన ప్రవహించే గోదావరి నికర జలాలను ఒడిసి పట్టి తెలంగాణ ప్రాంత కరువును తరిమేశారని వివరించారు.
సీఎం కేసీఆరే స్వయంగా చీఫ్ ఆరిటెక్ట్, ఇంజనీర్‌గా మారి ఎన్నో అవరోధాలు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. 90 మీటర్ల దిగువ నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను ఎత్తిపోసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. ‘నదుల్లో జలం ఉరకలెత్తుతూ ప్రవహించినంత కాలం.. కాళేశ్వరం ప్రాజెక్టు మనలో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. ఆలోచనల సరిహద్దులను చెరిపివేస్తుంది. అధిగమించలేని సమస్యే లేదని, సాకారం కాని కలలే ఉండ’వని గుర్తు చేస్తుందని కేటీఆర్ అన్నారు.
హరిత విప్లవంతో దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శ్వేత విప్లవంలో భాగంగా గత 8 ఏండ్లలో పాల ఉత్పత్తి 380 శాతం పెరిగిందన్నారు. గులాబీ విప్లవంతో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, అనుబంధంగా మాంస శుద్ధి పరిశ్రమలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ‘నీలి విప్లవంలో భాగంగా రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇన్‌ల్యాండ్ ఫిషరీష్‌లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. చేపలు, రొయ్యల ఉత్పత్తుల విలువలో 122 శాతం వృద్ధి నమోదైంది. ఆయిల్‌పామ్ సాగు ఏడు రెట్లు పెరిగింది. రాష్ట్రంలో పసుపు విప్లవాన్ని సాధించేందుకు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ విజయాలు రాష్ట్రంలోని 4 కోట్ల మంది జనాభాకు ఆహార ధాన్యాల లభ్యతను పెంచాయి‘ అని వెల్లడించారు. దేశానికి ఆహార భద్రతను కల్పించిందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు మిషన్ భగీరథ, కాళేశ్వరం విజయవంతంగా కార్యరూపం దాల్చడంలో మానవ వనరుల భాగస్వామ్యం మరువలేనిదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు ఒకే చోటుకు చేరి, వారి నైపుణ్యాలు, అనుభవాన్ని జోడించి ప్రాజెక్టులకు రూపం ఇస్తున్నారు. విజయవంతంగా పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. కొవిడ్ విజృంభించిన సమయంలోనూ శ్రామికులు తమ విధులకు దూరం కాలేదు. నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు.
ఇది వారి చిత్తశుద్ధికి, పనిపట్ల నిబద్ధతకు ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రాజెక్టుల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో ఇంజినీర్లు అద్భుతమైన పాత్ర పోషించారు. తమలోని ఆవిష్కరణలకు పదునుపెట్టారు. తెలంగాణ విజయగాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అమెరికాకు చెందిన సివిల్ ఇంజినీర్ల ముందు సగర్వంగా చెప్పగలను. ఆవిష్కరణల శక్తితో, అత్యద్భుత ఇంజినీరింగ్ నైపుణ్యాలతో ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చవచ్చో తెలంగాణ ఒక నిదర్శనంగా నిలిచింది’ అని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ కౌశలాన్ని, పరిమాణాన్ని గణాంకాలతో సహా మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వెలికితీసిన మట్టితో గాజాలోని 101 పిరమిడ్లను నింపవచ్చని, వినియోగించిన ఉకుతో 66 ఈఫిల్ టవర్లను, ఉపయోగించిన కాంక్రీట్‌తో 53 బుర్జ్ ఖలీఫాలను నిర్మించవచ్చని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లో ఇంజినీరింగ్ అద్భుతమని అభివర్ణించారు. ప్రాజెక్టు 13 జిల్లాల్లో 500 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నదని తెలిపారు. తాగునీటి సరఫరా, పారిశ్రామిక వినియోగం, నీటిపారుదలకు మొత్తంగా 240 టీఎంసీల కంటే ఎకువ నీటిని వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని, 7 మెగా లింక్‌లు, 28 ప్యాకేజీలతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. 20 కేంద్రాల్లో 22 పంప్‌హౌస్‌లు, 1,800 కిలోమీటర్ల మేర పొడవైన కాలువలు ఉన్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన 139 మెగావాట్ల పంపులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఉన్నాయని వివరించారు. 20 రిజర్వాయర్లలో నీటి నిల్వలు ప్రారంభమయ్యాయని, భారత్‌లోనే అతిపెద్ద మానవ నిర్మిత స్టోరేజీ రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను కూడా కాళేశ్వరంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. 13 జిల్లాల్లో మొత్తం కొత్తగా సాగునీటి వసతి కల్పించడంతోపాటు, ఇప్పటికే ఉన్న కమాండ్ ఏరియాలను స్థిరీకరించడమనే లక్ష్యంతో ప్రాజెక్టును రూపొందించినట్టు వెల్లడించారు. తెలంగాణ నీటిపారుదల రంగాన్ని సమూలంగా మార్చడంతోపాటు, వెన్నెముకగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ నీటిపారుదలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని, నీటి సమృద్ధికి ఎంతోగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ చేపట్టిన మరో పథకం మిషన్ భగీరథను పరిచయం చేయటం ఎంతో గర్వంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని పైపులైన్ ద్వారా అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పరస్పరం అనుసంధానమైన ప్రాజెక్టులని తెలిపారు. మిషన్ భగీరథ నీటికొరతను రూపుమాపడంతోపాటు తెలంగాణ పౌరుల జీవన నాణ్యతను పెంచడంలో కీలక భూమికను పోషించిందని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 2.8 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ఈ పథకం ఫ్లోరైడ్ కాలుష్యాన్ని విజయవంతంగా తొలగించిందని, ప్రభావిత గ్రామాల సంఖ్యను 967 నుండి సున్నాకి తగ్గించిందని చెప్పారు. భారత్‌లో 100 శాతం నల్లా కనెక్షన్ల కవరేజీని సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. 2025లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ ప్రకటిస్తూ, నిర్వాహకులను తెలంగాణకు ఆహ్వానించారు.
‘ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి వాస్తవం చేయగలగడమే నిజమైన నాయకత్వం’ అని వారెన్ బెన్నీస్ అన్న మాటలు అక్షరాల సీఎం కేసీఆర్‌ను ప్రతిబింబిస్తాయని కేటీఆర్ తెలిపారు. ఆలోచనలను వాస్తవంగా మార్చగల సత్తా సీఎం కేసీఆర్ సొంతం అని అన్నారు. తెలంగాణ భవితవ్యాన్ని మార్చడం, ప్రజల జీవితాలను మెరుగుపర్చడంపై కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నదని వెల్లడించారు. తన వ్యూహాత్మక ప్రణాళికలు, వినూత్న ఆలోచనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా అనేక అంశాల్లో విజయం సాధించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడమే ఆయన అసాధారణ నాయకత్వానికి, ఆలోచనలకు నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సమస్యను తీర్చడమే కాకుండా ఐదు విప్లవాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించిందని, గ్రామీణ తెలంగాణ సామాజిక-ఆర్థిక ప్రగతిని మెరుగుపరుస్తున్నదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ సాధించిన ఫలితాలను కూడా కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను భారతదేశానికి రైస్ బౌల్‌గా మార్చిందని అభివర్ణించారు. 90 లక్షల ఎకరాల భూమికి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతున్నదని వెల్లడించారు. స్థూల నీటిపారుదల భూమి 119 శాతానికి పెరిగిందని, వరి ఉత్పత్తి 4 రెట్లు పెరిగిందని తెలిపారు. 2015-16లో 3 మిలియన్ టన్నుల నుంచి 2022-23లో 15 మిలియన్ టన్నులకు ధాన్యం దిగుబడి పెరిగిందని వెల్లడించారు.
2014-15లో 131 లక్షల ఎకరాలున్న స్థూల విస్తీర్ణం 2021-22లో 198 లక్షల ఎకరాలకు పెరిగిందని, అది 51 శాతం పెరుగుదల అని వివరించారు. వరి సాగు విస్తీర్ణం 2015-16లో 25 లక్షల ఎకరాలు ఉండగా, 2021-22లో 279 శాతం పెరుగుదలతో 97 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. కేసీఆర్ నిర్ణయాలు, ఆలోచనా విధానం ఫలితంగా వ్యవసాయం, అటవీ, పశుసంపద, మత్స్య రంగాలలో స్థూల రాష్ట్ర విలువ జోడింపు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.