హైదరాబాద్ : ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. స్తంభంపల్లిలోని చిన్నపాటిగుట్ట బోళ్ల వద్ద పరిశ్రమను నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ నిర్ణయించి, ఆ ప్రాంతాన్ని చదును చేయించాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TSIIC) ఎండీ వెంకట నర్సింహారెడ్డిని ఆదేశించారు.
పరిశ్రమ స్థాపనపై మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, పోలీస్ హౌసింగ్ సొసైటీ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, క్రిభ్ కో తెలంగాణ ఇన్చార్జి రాంరెడ్డితో మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్కు కొప్పుల, వెంకటేశ్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. మారుమూల ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం రైతాంగం, స్థానిక ప్రజలంతా ఎదురు చూస్తుండగా.. పరిశ్రమ స్థాపనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.