హైదరాబాద్ : శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. రూ. 500 కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో రెండు ఎకరాలకు తగ్గకుండా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. 141 మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు కడుతున్నాం. రూ. 850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నాం. యువకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌లో 74, మున్సిపాలిటీల్లో 369 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం.
హరితహారం కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను కేటాయించాం. భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటైంది. పేదవారికి రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నాం. 10 వేలకు పైగా టాయిలెట్లు కట్టామన్నారు. గతంలో 68 మున్సిపాలిటీల్లో కేవలం 21 నర్సరీలు మాత్రమే ఉండేవి. ఈ మూడేండ్లలో 141 పట్టణాల్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనాన్ని పెంచుతున్నాం. చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.