నల్లగొండ : ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే. ప్రజలు ఆశీర్వదించాలని, అండగా ఉండాలని. మీరు ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో, డబుల్ స్పీడ్‌తో పని చేస్తాం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు పట్టణంలో రూ. 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన వారు నియోజకవర్గాన్ని అనాథను చేశారు. నాలుగేండ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదు అని గుర్తు చేశారు. కానీ ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. అందరికీ అండగా ఉండి, మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. భవిష్యత్‌లో మీ ఆదరణ, ప్రోత్సాహం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.
పేదవాడి ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం కిందనే లెక్క అని కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చి ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. ఆడబిడ్డల కష్టాలను తీర్చింది కేసీఆర్ మాత్రమే. సాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా కేసీఆర్‌దే. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా మారిపోయే పార్టీ కాదు.. మారిపోయే ప్రభుత్వం కాదు. ఎన్నికల ముందైనా, ఎన్నికల తర్వాత అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా పేదల కోసం పని చేసిందా? ఆలోచించండి అని ప్రశ్నించారు. ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. గతంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవి అని కేటీఆర్ గుర్తు చేశారు.
మీ అందరి ఆశీర్వాదం, అభిమానంతో సరిగ్గా రెండు నెలల కిందట నవంబర్ 6వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చండూరు పట్టణంలో రూ. 40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నాం అని తెలిపారు. రూ. 30 కోట్లతో మెయిన్‌రోడ్డుకు శంకుస్థాపనం చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లోనే అందమైన చండూరును పరిచయం చేస్తాం. మెయిన్ రోడ్డు ఒక్కటే కాకుండా 10 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 3 కోట్లు, మోరిల నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసి, శంకుస్థాపనలు చేశామన్నారు. రూ. 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించి, సవ్యమైన వసతి కల్పిస్తాం. రూ. 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపనం చేశాం. రూ. 2 కోట్లతో నిర్మించబోయే కొత్త మున్సిపల్ భవనానికి శంకుస్థాపనం చేశామని కేటీఆర్ వెల్లడించారు.
పట్టించుకునే శాసనసభ్యుడు ఉంటే.. ఇంత వేగంగా పనులు జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయి 60 రోజులు అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లు మాదిరిగానే బాధ్యతగా పని చేస్తున్నాము. రెండు నెలల్లో ఇది రెండోసారి రావడం. ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయలేదు. గతంలో వచ్చినప్పుడు ఆరుగురు మంత్రులం కలిసి అన్ని రంగాలపై సమీక్షించాం. వాగ్దానాలు ఇచ్చి వెళ్లాం. దానికి అనుగుణంగా ఇవాళ రూ. 40 కోట్లతో చండూరు పట్టణంలో, గట్టుప్పల్‌లో రూ. 8 కోట్ల 91 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఎన్నో రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చండూరు పట్టణమైనా, చౌటుప్పల్ పట్టణమైనా, పూర్వపు నల్లగొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలను మార్చే దిశగా ప్రయత్నిస్తున్నాం. కేసీఆర్ నేతృత్వంలో పూర్వపు నల్లగొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.