హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో వేల మంది పౌరులు మృత్యువాత పడటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తున్నదని ట్విట్టర్ వేదికగా ఆవేదన చెందారు. గాజాలోని ఒక దవాఖానపై జరిగిన బాంబు దాడిలో అమాయకులైన వందల మంది పౌరులు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరం అని తెలిపారు.
గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఘర్షణల కారణంగా 4,500 మందికి పైగా మరణించటం హృదయవిదారకం అని పేర్కొన్నారు. తక్షణమే కాల్పులు విరమించాలన్న పిలుపునకు తానుకూడా మద్దతునిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. గాజా ప్రజలకు వెంటనే మానవతా సాయాన్ని అందజేయాలని అన్నారు. ఈ అవాంఛిత యుద్ధంలో భాగస్వాములైన అన్ని పక్షాలు విచక్షణారహిత హింస నుంచి వైదొలగాలని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. అటు పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని, అలాగే తమ పౌరుల భద్రతపై ఇజ్రాయెల్ ఆందోళనను కూడా పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.