పద్యాలు, కవితలు.. పంచ్‌లు, సెటైర్లు.. యాసలు, ప్రాసలు.. వ్యంగ్యాస్ర్తాలు, ఛలోక్తులు.. ఒకసారి గంభీర వాతావరణం, మరోసారి నవ్వులు.. చర్చంటే ఇలాగే ఉండాలి! మాటకు అంత పదునుండాలి!! అన్నట్టు సాగింది మంత్రి కేటీఆర్ స్పీచ్. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పల్లెప్రగతి, పట్టణప్రగతిపై శనివారం అసెంబ్లీలో కొనసాగిన లఘు చర్చ సందర్భంగా కేటీఆర్ తన మాటలతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఆద్యంతం అద్భుత వ్యాఖ్యానంతో కట్టిపడేశారు. మొత్తంగా మంత్రి ప్రసంగానికి సభ హర్షధ్వానాలు పలికింది.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సభలో పలు కవితలతో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు రచించిన కవితను చదివి వినించారు.
‘మడుగు సింగారం మత్య్సానికి ఎరుక
కడకడల తిరిగే కప్పలకు ఏమి ఎరుక..
వలసగూటి సింగారం కోకిలకు ఎరుక
కంపగూటి సింగారం కాకికి ఏమి ఎరుక..
బాట సింగారం అశ్వానికి ఎరుక
గరిక తుట్టెలు తిరిగే గాడిదకు ఏమి ఎరుక’
అంటూ కాంగ్రెస్ ఆరోపణలను ఎండగట్టగా, సభలో నవ్వులు విరబూశాయి. ‘మీరున్న కాడ వల్లకాడు.. పల్లె కన్నీరు పాట కట్టింది.. కాడి.. మేడి.. ఎద్దు.. ఎవుసం ఏడ్చాయి’ అంటూ కాంగ్రెస్ నేతల దుమ్ము దులిపారు. వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాసిన పాటలు, శ్రీశ్రీ కవితలను ఉటంకించి హస్తం నేతల భరతం పట్టారు. తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో కొన్ని రాబందులు మళ్లీ తిరుగుతున్నాయంటూ ప్రజలను చైతన్యవంతులను చేసేలా తెలంగాణ కవి, కరీంనగర్ ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన మాటను గుర్తు చేశారు.
‘జాగ్రత్తా…
ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద..
చూస్తూ చూస్తూ వేయకు గద్దకు..
ఓటు కేవలం కాగితంపై ముద్ర కాదు..
మీ జీవితం కింద ఎర్తు.. గుర్తు పెట్టుకో!’అని చెప్పారు.
ఆకట్టుకున్న యతిప్రాసలు మంత్రి కేటీఆర్ యతిప్రాసలతో ప్రసంగించి అందరిని కట్టిపడేశారు.
‘శిథిలం నుంచి శిఖరం వైపు విధ్వంసం నుంచి వికాసం వైపు అగాథం నుంచి ఆకాశం వైపు సంక్షేమం సముద్రమంతా అభివృద్ధి ఆకాశమంత మా విధానం నిర్మాణం.. నిర్మాణాత్మకం పల్లెల్లో హార్వెస్టర్లు.. పట్టణాల్లో ఇన్వెస్టర్లు పరుగులు నాటి కరువుసీమలు నేడు కోనసీమలు’
అంటూ తెలంగాణ ప్రగతిని యతిప్రాసలతో వివరించి సభలో జోష్ పెంచారు. మరోవైపు మిషన్ భగీరథతో ప్రజలకు నీళ్లు తాగించాం.. ప్రతిపక్షాలకూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తామంటూ ఛలోక్తులు విసిరారు.
పాకిస్థాన్ టీమ్‌లా కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ టీమ్‌లా మారిందని, అందరూ కెప్టెన్లే అంటూ వ్యంగ్యాస్ర్తాలను సంధిస్తూ సభలో నవ్వులు పూయించారు కేటీఆర్. ప్రసంగాన్ని కొనసాగిస్తూనే మధ్యలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్కను ఉద్దేశించి ‘మీరు ఇక్కడ ఉన్నారు. గాంధీభవన్‌లో మీ పార్టీ గూడుపుఠాణి చేస్తున్నది. మీకే గోతులు తీస్తున్నది. ఏమిటో కనుక్కోండి’ అంటూ వ్యాఖ్యానించగా సభలో మళ్లీ నవ్వులు పూశాయి. ప్రభుత్వం పనులు చేయటం లేదంటూ ఓసారి, నిధులు ఇవ్వటం లేదంటూ మరోసారి.. ఇలా నిమిషాల్లోనే పొంతనలేని మాటలు మాట్లాడొద్దని భట్టికి సూచించారు. పనులే చేయనిది.. నిధులు ఇవ్వటం లేదనే ప్రశ్న ఎలా వస్తుంది? అని అడిగారు. నిమిషాల్లోనే ఓసారి ప్రభుత్వం పని చేస్తున్నదని, వెంటనే చేయటం లేదని అనటం ఏంటని ప్రశ్నించారు. ‘ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు. కనీసం మీరైనా క్లారిటీగా ఉండండి’ అని చురక అంటించారు. పాదయాత్ర చేసి అలిసిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వెంటనే భట్టి తన సీటు నుంచి లేచి బయటకు వెళ్లటం గమనార్హం. ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్‌పై కేటీఆర్ ఏకపక్ష దాడిని కొనసాగించారు.
4 కాదు.. 400 ఫొటోలతో భట్టి గాలి తీసిన కేటీఆర్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో అభివృద్ధి ఏమీ లేదంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క సభలో 4 ఫొటోలను ప్రదర్శించారు. మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, రోజుకు ఒక ట్యాంకర్‌ను స్వయంగా బుక్ చేసుకుంటున్నానని తెలిపారు. దీనిపై అంతే దీటుగా, సాధికారికంగా మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. అభివృద్ధి ఏమీ లేదంటూ భట్టి విక్రమార్క కేవలం 4 ఫొటోలు మాత్రమే చూపారని, కానీ పల్లెలు సాధించిన ప్రగతి ఫొటోలు 400 చూపుతానంటూ చెప్పటమే కాకుం డా, ఆ మేరకు ప్రదర్శించటం విశేషం. నీటి ట్యాంకర్ బుక్ చేసుకున్నానన్న భట్టి మాటలు వట్టివేనని ఆధారసహితంగా నిరూపించారు. భట్టి నివాసముంటున్న ఇంటి నల్లా క్యాన్ నంబర్‌తో వివరాలు వెల్లడించి కాంగ్రెస్ గాలి తీయడంతో సభలో నవ్వులు విరబూశాయి.