హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ కన్నా మెరుగైన పాలనా నమూనా ఎక్కడ ఉన్నదో చూపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సవాల్ విసిరారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని సీఎం ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్, ఇన్నోవేషన్ స్కీం, ఎస్టీ ఎంఎస్ఎంఈ స్కీం లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారాభవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నిన్ననే ఓ పొలిటికల్ టూరిస్ట్ వచ్చి ఏదో మాట్లాడిపోయిండు. నేను ఆయన్ను ఒకటే అడుగుతున్నా.. తెలంగాణ కన్నా మెరుగైన పరిపాలన నమూనా దేశంలో ఒక్కటి చూపించు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ అని రిజర్వుబ్యాంక్ ప్రకటించిన విషయ వాస్తవం కాదా? మూడు శాతం కన్నా తక్కువ జనాభా గల తెలంగాణ 30 శాతానికి పైగా పంచాయతీ అవార్డులను గెలుచుకోలేదా? తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా వస్తే దేశం ముందుకుపోయేది కాదా? తెలంగాణ తలసరి ఆదాయాన్ని 166 శాతం పెంచుకోగలిగినప్పుడు మిగతా రాష్ర్టాలు ఎందుకు పోటీపడలేకపోయాయి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
మోదీకి ఇదే చెప్పా
ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ దేశాభివృద్ధిని నిర్దేశించే మూడు సూత్రాలని కేటీఆర్ చెప్పారు. ఈ మూడు లేకపోకపోతే దేశం ముందుకుపోదని తాను గతంలో ప్రధాని మోదీకి చెప్పానని వెల్లడించారు. సత్య నాదెళ్ల, శంతన్ నారాయణ్, సుందర్‌పిచాయ్ వంటి మన దేశానికి చెందిన గొప్ప సీఈవోలు పనిచేస్తున్న అగ్రశ్రేణి సంస్థలను ఎందుకు సృష్టించలేకపోయామని ప్రశ్నించారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఇన్నోవేషన్ మన దేశం నుంచి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉన్నదని, వారి ఆత్మవిశ్వా సం, ధైర్యం చూస్తుంటే అబ్బురమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్టీ ఆంతప్రెన్యూర్స్కు ఎంత సాయం చేసేందుకైనా ప్రభు త్వం సిద్ధంగా ఉన్నదని, ఆస్తిపన్ను సహా మున్సిపల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. స్రవంతి అనే గిరిజన ఆంతప్రెన్యూర్ రూ.4 కోట్లతో రెస్టారెంట్ పెట్టి ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మంత్రి సత్యవతిరాథోడ్ తన దృష్టికి తీసుకొచ్చారని, ఆమెకు పూర్తిగా సహకరిస్తామని అభయమిచ్చారు. పరిశ్రమలు ఖాయిలా పడే ప్రమాదం ఉంటే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా సహకరిస్తామని చెప్పారు.
ఫెయిల్యూర్స్‌కు భయపడొద్దు
జీవితంలో విఫలమైన ప్రతిసారి సెలబ్రేట్ చేసుకోవాలని, ఎదురుదెబ్బ తగిలినా వెనకడుగువేయవద్దని, తిరిగి ప్రయత్నించడం మానొద్దని యువతకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చా రు. బేలతనం, ఆత్మన్యూనతాభావం, నాతో అయితదా అన్న భావన సమసిపోతేనే యువ త ముందడుగేయగలదని చెప్పారు. నేటి తరానికి దృఢచిత్తం, స్థిరచిత్తం అవసరమని ఉద్భోదించారు. ‘ఏదైనా కొత్త పని చేపట్టినా, కొత్త ఆలోచనతో వచ్చినా సమాజం నిన్ను తిడుతది. తూలనాడుతది. కొంతకాలానికి నీతో పోరాటానికి దిగుతది. ఆ తర్వాత నీ విజయాన్ని చూసి నిన్ను పొగుడుతుంది’ అన్న గాంధీజీ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కరోనా గీతలను చెరిపేసింది
‘సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్న భావనలు మనకు మనమే సృష్టించుకున్నవి. మనుషులందరిలో ప్రవహించేది.. ఎవరికి చిన్న గాయమైనా కారేది ఎర్రటి రక్తమే. అయినా మనిషిని మనిషిగా చూసే పరిస్థితి నేడు లేదు. అవే అంతరాలు. వివక్షలు కొనసాగుతున్నాయి. కులం, ఉపకులం అనే అడ్డుగోడలు మనం పుట్టించుకున్న కథలు. మన నుంచి పుట్టిన దూరాలు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే కులం, మతం పంచాయితీ మొత్తం దూరమైతది. అయినా సమాజంలోని అన్ని కులాలు, మతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ గిరిజనులకు ధైర్యం: సత్యవతిరాథోడ్
కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. గత ప్రభుత్వాలు దయతో ఇచ్చే సబ్సిడీలే గిరిజనులకు దిక్కుకాగా, సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు తమ జీవిత కాలానికి కావాల్సినంతగా సంపాదించుకున్నారని చెప్పారు. అడిగిన వాటితో పాటు అడగనివి కూడా ఇచ్చి, ఇవి మీ హక్కులు అంటూ అడిగే ధైర్యాన్నిచ్చారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేశారని, దీంతో 30 వేల మంది ప్రజాప్రతినిధులయ్యారని గుర్తుచేశారు. గిరిజన ముఖ్యమంత్రులు పనిచేసిన మహారాష్ట్రలో సాధ్యంకానిది, తెలంగాణలో సాధ్యమైందని వివరించారు.
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం: హోం మంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర అభివృద్ధి అంటే అన్ని వర్గాలు అభివృద్ధి సాధించడమన్న నినాదంతో ముందుకెళ్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం దుబాయ్ తరహాలో కనబడుతున్నదంటూ ఇందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్దూ, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, కార్పొరేటర్ మన్నె కవితాగోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.