వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్కు దమ్ముంటే.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రుణమాఫీ, రైతుబంధు పథకం అమలు చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పాతరవేశారు. కానీ వ్యవసాయాన్ని జాతర చేసింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు వరి 45 లక్షల టన్నులు పండింది.. ఈ రోజు 2021లో 3 కోట్ల టన్నులు వరి పంట పండిందని తెలిపారు. 24 లక్షల టన్నులు మాత్రమే నాడు కొనుగోలు చేశారు. నేడు ఒక కోటి 41 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్ఞానులని కేటీఆర్ విమర్శించారు.
16 వేల పైచిలుకు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగాయని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించిందన్నారు. అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు తగ్గింది తెలంగాణలోనే అని చెప్పారు. ఈ ప్రశ్నను అడిగింది కూడా మీ గాడ్సే అని గుర్తు చేశారు. ఇదే గాడ్సే అడిగితే అదే కేంద్రం చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు.
నిన్న జరిగింది రైతు సంఘర్షణ కాదని కేటీఆర్ అన్నారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు.. ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ అని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో అసమ్మతి లొల్లి.. రాష్ట్రంలో నలుగురు నాయకులు కలిసి ఉండలేరు. అలా కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆదర్శ రైతులున్న పంజాబ్లో మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మిమ్మల్ని తరిమికొట్టారు. మీరు నిన్న చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీ ఇది వరకు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడూ నమ్మరు. మీరు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముందు రుణమాఫీ, రైతుబంధు అమలు చేసి పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ డిక్లరేషన్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుందా? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉండవా? అని కేటీఆర్ ప్రశ్నించారు.