హనుమకొండ, ఫిబ్రవరి 24 : డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జీవో నంబర్ 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) నేతృత్వంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీనికి ఐజేయూ, టీయూడబ్ల్యూజే(హెచ్)-143 జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపారు. 252 జీవోను సవరించి డెస్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్టుగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని అన్ని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వరంగల్ ఎడిషన్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఇకడి నుంచే ఆయా పత్రికలు ప్రచురితమై వెళ్తాయని తెలిపారు. ఆరు జిల్లాల వార్తలకు ఆయా పత్రికల్లో 20 నుంచి 25 మంది సబ్ ఎడిటర్లు ఉంటారని వివరించారు. వీరందరికీ గతంలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సారి ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీవోలో పేరొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ఆయా పత్రికల్లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లందరికీ ఎడిషన్ కేంద్రంలో అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహా శబరీష్కు వినతిపత్రం అందజేశారు.